Pawan Kalyan: మహిళా అంధ క్రికెటర్ల విజయం దేశానికే గర్వకారణం: డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:40 PM
మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో పవన్ సమావేశమై.. వారిని సత్కరించారు.
అమరావతి, డిసెంబర్ 12: ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) భేటీ అయ్యారు. ఈరోజు (శుక్రవారం) మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించిన పవన్.. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు. ప్రతి మహిళా క్రికెటర్‌కు పట్టు చీర, శాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు.
అనంతరం డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమన్నారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని.. అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు దీపిక (జట్టు కెప్టన్), పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
ఇక ఈ సమావేశంలో భాగంగా జట్టు కెప్టన్ దీపిక తమ గ్రామ సమస్యలను ఉపముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన పవన్.. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన క్రికెటర్ కరుణ కుమారి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
టెక్ హబ్‌గా దూసుకెళ్తున్న విశాఖ.. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన
విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News