Share News

Minister Janardhan Reddy: ఏపీలో హార్బర్లు, పోర్ట్‌ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:32 PM

విజయవాడ, కడప, తిరుపతి, కుప్పం విమానాశ్రయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణ, ఇతర సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌లను ఆదేశించామని తెలిపారు. అమరావతిలో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి అధ్యయనం చేస్తున్నామని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెల్లడించారు.

Minister Janardhan Reddy: ఏపీలో హార్బర్లు, పోర్ట్‌ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
Minister BC Janardhan Reddy

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హార్బర్లు, పోర్ట్‌ల నిర్మాణంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) వ్యాఖ్యానించారు. ఏడాది కాలంలో వీటిని పూర్తి చేసి ప్రారంభించే విధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. ఫేజ్ టూ కింద మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లలో కూడా నిర్మాణ పనులు చేపడతామని వివరించారు. 950 కిలోమీటర్ల తీర ప్రాంతంలో.. ప్రతి 50 కిలోమీటర్లకు షిప్పింగ్ బోట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇవాళ(గురువారం) ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ అథారిటీ (APIWA) ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్. శివప్రసాద్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి యువరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


భోగాపురం విమానాశ్రయం పనులు 78శాతం పూర్తయ్యాయని.. ఈ ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. రూ.595 కోట్లతో విజయవాడ విమానాశ్రయాన్ని కూడా అన్నిస్థాయిల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. త్వరలోనే నూతన నిర్మాణాలను, భవనాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. విజయవాడ, కడప, తిరుపతి, కుప్పం విమానాశ్రయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. భూసేకరణ ఇతర సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌లను ఆదేశించామని అన్నారు. అమరావతిలో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి అధ్యయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మూడేళ్లలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నామని తెలిపారు. కేంద్రప్రభుత్వ సాయంతో ఏపీ ఫైబర్ నెట్‌ని పూర్తిగా పునరుద్దరిస్తామని అన్నారు. గత జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్ట్‌లను తమ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.


978 కిలోమీటర్ల జాతీయ జలమార్గాలు, 57 నదులతో భారతదేశంలో అత్యంత జలసంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉండటం మనకు గర్వకారణమని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న లోతట్టు జలమార్గాల ద్వారా సంవత్సరానికి 8 మిలియన్ టన్నుల సరుకును తరలిస్తున్నామని వెల్లడించారు. కడప, ముక్త్యాల, జగ్గయ్యపేటలలో సిమెంట్, విద్యుత్ ప్లాంట్లకు వ్యూహాత్మక అనుసంధానాలతో, మనం దీనిని ఏటా 14 మిలియన్ టన్నులకు పెంచడం, రహదారులపై ఒత్తిడిని తగ్గించడం, లాజిస్టిక్‌ల ఖర్చు తగ్గిస్తోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ అసలైన మల్టీమోడల్ కారిడార్‌లను అభివృద్ధి చేస్తోందని అన్నారు. పరిశ్రమలకు లోతట్టు ప్రాంతాల నుంచి ప్రపంచ మార్కెట్లకు సజావుగా అనుసంధానం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ అజెండా ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. నెల్లూరులో రూ.280 కోట్లతో నిర్మించిన షిప్పింగ్ హార్బర్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారని గుర్తుచేశారు. గత జగన్ ప్రభుత్వం పోర్ట్‌లు, షిప్పింగ్ హార్బర్‌లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వాటిని తిరిగి ఇప్పుడు నిర్మాణం చేసే విధంగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు..

For More AP News and Telugu News

Updated Date - Jun 26 , 2025 | 04:43 PM