Lokesh On Medical Colleges: మెడికల్ కాలేజీల అంశం.. లోకేష్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 03:11 PM
పులివెందులలో జగన్ కనీసం కాలేజీ కట్టలేదని మంత్రి లోకేష్ అన్నారు. దీనిపై అసెంబ్లీ, శాసన మండలిలో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేస్తామని చెప్పారు. అమ్మ అన్నం పెట్టదు... అడుక్కు తిననివ్వదు అన్నట్టు జగన్ వైఖరి ఉందంటూ ఎద్దేవా చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 22: మెడికల్ కళాశాలలు ప్రైవేట్‌పరం చేయడం లేదని.. కేవలం పీపీపీ మోడ్‌లో వెళ్తున్నామని మంత్రి నారా లోకేష్ (Minster Nara Lokesh) వెల్లడించారు. సోమవారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. రోడ్లు కూడా అదే విధానంలో చేస్తున్నామని అన్నారు. పులివెందులలో జగన్ కనీసం కాలేజీ కట్టలేదన్నారు. దీనిపై అసెంబ్లీ, శాసన మండలిలో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేస్తామని చెప్పారు. అమ్మ అన్నం పెట్టదు... అడుక్కు తిననివ్వదు అన్నట్టు జగన్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. 1994లో చంద్రబాబు కాంగ్రెస్ వారి మాట వినుంటే స్టేట్‌లో ఇన్ని ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చేవా అని ప్రశ్నించారు. అదే ప్రిజనరీ, విజనరీకి ఉన్న తేడా అని అన్నారు.
త్వరలోనే టీసీఎస్..
విశాఖకు త్వరలో టీసీఎస్ వస్తుందని.. ఇప్పటికే టీసీఎస్‌లో రిక్రూట్మెంట్ ప్రారంభమైందని తెలిపారు. జీఎస్టీ కొత్త విధానం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని.. దీని ద్వారా సొసైటీలోకి డబ్బు వస్తుందన్నారు. అలాగే ఆర్థిక పురోగతి ఉంటుందని... ఫలితంగా పన్ను చెల్లింపు కూడా ఉంటుందని వెల్లడించారు. మూడు నెలల్లో కాలేజీ ఫీజ్ రీయింబర్స్ మెంట్ మూడు బకాయిలు వెంటనే చెల్లిస్తామని ప్రకటించారు. జగన్ హయాంలోని మూడు నెలలు బకాయిలు ఏం చేయాలనేది త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు. తమ హయాంలో ఉన్న మూడు నెలలు క్లియర్ చేసి ఆ తరువాత టైమ్ షెడ్యూల్‌లో ఇచ్చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభంలో డీఎస్సీ ఉంటుందని ప్రకటించారు.
పరిశ్రమల కోసం మూడు సూత్రాలు..
పరిశ్రమలకు అవగాహన ఒప్పందం చేసుకోవడం కాదని.. వెంటనే గ్రౌండ్ చేయడంపై దృష్టి పెట్టామన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాము మూడు సూత్రాలు చెబుతున్నామని చెప్పారు. చంద్రబాబు విజినరీ, సమర్థ నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌లను తాము విదేశాల్లో చెబుతున్నామన్నారు మంత్రి. టీసీఎస్‌కు మిలీనియం బ్లాక్‌లో ఇచ్చామని... మిగతా కంపెనీలకూ తాము అలానే ఇస్తున్నామని తెలిపారు.
దేవుడే బయటకు తీశారు..
29 ఏప్రిల్ 2023న రాత్రి 11 గంటలకు తిరుపతి పరకామణిలో చోరీ జరిగిందని.. మరుసటి రోజు వెంటనే చార్జిషీట్ వేశారని.. అంటే వెంటనే చార్జిషీట్ సిద్ధం చేసుకున్నారని తెలిపారు. పైగా ఇంత పెద్ద నేరానికి 41 సీఆర్‌పీసీ నోటీస్ ఇచ్చారన్నారన్నారు. ఇప్పుడు దేవుడే బయటకు తీశారని అన్నారు. పరకామణి చోరీపై త్వరలో సిట్ విచారణకు నియమిస్తామని వెల్లడించారు. పరకామణి చోరీ దొంగలను దేవుడు కూడా వదలలేదని.. అందుకనే బయటకు వచ్చిందన్నారు. అసలు తిరుమల ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడటం ఏమిటి.. అసలు నెయ్యిలో నెయ్యే లేదని తేల్చారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News