YS Jagan: అంతా రాజకీయాల కోసమే.. పరకామణి కేసుపై జగన్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 04 , 2025 | 02:52 PM
పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో పారదర్శక వ్యవస్థ సృష్టిస్తే తమపై నిందలా అంటూ మండిపడ్డారు.
అమరావతి, డిసెంబర్ 4: పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పరకామణి కేసులో దొరికింది 9 డాలర్లు అని.. ప్రాయశ్చిత్తంగా రూ.14 కోట్ల ఆస్తులను టీటీడీకి ఇచ్చారని తెలిపారు. దొంగ దొరకగానే కేసు నమోదైందని.. తిరుపతి కోర్టులో చార్జ్‌షీట్ వేశారని తెలిపారు. మెగా లోక్ అదాలత్‌లో కేసును పరిష్కరించారని అన్నారు. జ్యుడిషియల్ విచారణ జరిగాక.. మళ్లీ కేసును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.
రాజకీయాల కోసం ఇదంతా తిరగదోడుతున్నారని మండిపడ్డారు. పరకామణి దొంగ.. జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పనిచేశారని అన్నారు. పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నారని తెలిపారు. తిరుమల హుండీ లెక్కింపును తాము పారదర్శకం చేశామని వెల్లడించారు. పరకామణిలో ప్రతిచోట సీసీ కెమెరాలు పెట్టించామన్నారు. తిరుమలలో పారదర్శక వ్యవస్థ సృష్టిస్తే తమపై నిందలా అంటూ వ్యాఖ్యలు చేశారు. పరకామణి కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారన్నారు. చోరీ చేస్తున్న దొంగను పట్టుకోవడం నేరమా అంటూ మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రైతుల పరిస్థితి దారుణం..
సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేలా రాష్ట్రంలో పాలన ఉందని ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో వ్యవసాయాన్ని పండగ చేశామని.. పండగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా ఈ ప్రభుత్వం మార్చిందని మండిపడ్డారు. 19 నెలల చంద్రబాబు పాలనలో 17 సార్లు ప్రకృతి వైఫరిత్యాలు వచ్చాయన్నారు. తుఫానుతో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా రాలేదని అన్నారు. తుఫాను కంటే ముందే కొనాల్సిన పంటల కొనుగోలు చేయలేదని ఫైరయ్యారు. రూ.1,100 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు ఇవ్వలేదని ఆరోపించారు.
రైతులకు హక్కుగా ఉన్న పంట బీమా పథకాన్ని రద్దు చేశారని.. కేజీ అరటిపండ్లు అర్ధ రూపాయంటే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. తమ హయాంలో అరటి, చీని రైతుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపామని.. ఏపీ నుంచి ఢిల్లీ, ముంబైకి రైళ్లలో 3లక్షల టన్నులు ఎక్స్‌పోర్ట్ చేశామని చెప్పుకొచ్చారు. రైతులకు ఏ పంటకూ మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదన్నారు. తమ హయాంలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీలను మూసేశారని.. ఈక్రాప్ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి
శ్వాస తీసుకోలేడు.. అన్నం తినలేడు.. ఏడాది గడిచినా దయనీయ స్థితిలోనే శ్రీతేజ్
Read Latest AP News And Telugu News