Indrakeeladri Durga Temple: అమ్మవారి దర్శనం.. ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు
ABN , Publish Date - Sep 28 , 2025 | 07:37 PM
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారని నగర సీపీ రాజశేఖర బాబు తెలిపారు. ప్రతి రోజూ లక్షపై చిలుకు భక్తులు దర్శనానికి వస్తున్నారని వివరించారు. ఈ రోజు లక్షన్నర మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నామన్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 28: ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో దసరా నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు.. సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శన మివ్వనున్నారని దేవాలయం ఈవో శీనా నాయక్ వెల్లడించారు. అమ్మ వారి జన్మ నక్షత్రం మూల కావడంతో.. దర్శనానికి భక్తులు పోటెత్తుతారని తెలిపారు. సోమవారం దాదాపు రెండు లక్షల మంది భక్తులు.. అమ్మ వారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామన్నారు. దీంతో భక్తుల రద్దీ దృష్ట్యా రేపు చిన్న చిన్న ఆంక్షలు ఇంద్రకీలాద్రిపై అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్జిత సేవలకు వచ్చే భక్తులు నిర్ణీత గడువులోగా దేవాలయానికి చేరుకోవాలని ఆయన సూచించారు. ఆలయానికి సంబంధించిన వాహనాల్లోనే కొండపైకి రావాలని భక్తులకు స్పష్టం చేశారు. అందరికి దర్శన భాగ్యం కల్పించేందుకు అన్ని శాఖలతో కలిసి సమన్వయంతో తాము పని చేస్తున్నామని ఈవో శీనా నాయక్ వివరించారు.
ఇక ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు.. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను ఆదివారం పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా మాట్లాడుతూ.. ఉత్సవాల్లో కీలక ఘట్టానికి చేరుకున్నామన్నారు. ఇప్పటి దాకా 87 వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారని వివరించారు. ఆ భక్తుల సంఖ్య లక్షన్నర దాట వచ్చునన్నారు. ఈ రోజు రాత్రి 9 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారిని చండీ అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనానికి రాత్రి 11 గంటల నుంచి క్యూలైన్లో దర్శనానికి పంపిస్తామని చెప్పారు. అయితే కృష్ణానదిలో నీటి ప్రవాహం అధికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో నదిలోకి దిగ వద్దని భక్తులకు ఈ సందర్భంగా ఆయన మనవి చేశారు.
సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారని తెలిపారు. ప్రతి రోజూ లక్షపై చిలుకు భక్తులు దర్శనానికి వస్తున్నారని వివరించారు. ఈ రోజు లక్షన్నర మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. హోల్డింగ్ ఏరియాలో భక్తులు కొంత సహనం పాటించాలని సూచించారు. క్యూ లైన్‌లో అద్భుతమైన ఏర్పాట్లు ఉన్నాయని.. వీఐపీలను సైతం పరిమితి ప్రకారమే పంపిస్తున్నామన్నారు. భక్తులు సహకరిస్తే అందరికీ అమ్మ వారి దర్శన భాగ్యం కల్పించేందుకు తాము కృషి చేస్తున్నాని చెప్పారు.
దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి..
దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆదివారం శ్రీ మహా చండీ దేవి అలంకారంలో దుర్గమ్మ వారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని.. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని తాను కోరుకున్నానని చెప్పారు. భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రభుత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. కూటమి ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పేట వేస్తుందని చెప్పారు. పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాదరణ వస్తుందని చెప్పారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారని వివరించారు.
ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. చండీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేవి నవరాత్రుల్లో అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులు అమ్మ వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తామని.. 10వ రోజు విజయ దశమి వేళ.. దసరా పండుగ చేసుకుంటామని వివరించారు. ఎన్డీయే కూటమి తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. వీఐపీ ప్రోటోకాల్ సమయంలో కూడా పెద్ద ఎత్తున సామాన్య భక్తులు అమ్మ వారిని దర్శనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మంత్రులు లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ తరుపున ప్రజలందరికి ఉండవల్లి శ్రీదేవి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కరెంట్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. స్పందించిన బండారు విజయలక్ష్మీ
For More AP News And Telugu News