By Elections In Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. స్పందించిన బండారు విజయలక్ష్మి
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:23 PM
మరికొన్ని రోజుల్లో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో దింపేందుకు ఇప్పటికే రాజకీయ పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించాయి. అలాంటి వేళ..
హైదరాబాద్, సెప్టెంబర్ 28: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అభ్యర్థిని బీజేపీ నిర్ణయం మేరకే ఖరారు చేస్తారని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, అలాయ్ బలాయ్ కార్యక్రమం చైర్మన్ బండారు విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో బండారు విజయలక్ష్మి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసలు ఈ కార్యక్రమం 2005లో జయగార్డెన్ వేదికగా ప్రారంభమైందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
అలా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఎంతో మంది రావడం అదృష్టమన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన మొదటి కార్యక్రమం అలాయ్ బలాయ్ అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు పద్మా అవార్డులు సైతం దక్కించుకున్నారన్నారు. తెలంగాణ సంస్కృతికి ఇది కేంద్రంగా ఉంటుందన్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్‌ను అభినందిస్తూ సన్మాన కార్యక్రమం సైతం చేపడుతున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డితోపాటు పలువురు కేంద్ర, రాష్ట్రాలకు చెందిన మంత్రులు సైతం హాజరువుతారన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులందరికీ ఆహ్వానం అందించామని తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు ఆయన కుటుంబం ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది ప్రముఖులు హాజరవుతారన్న సంగతి అందరికి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం
గాంధీ హిల్‌కు పూర్వ వైభవం: ఎంపీ కేశినేని చిన్ని
For More TG News And Telugu News