Gottipati Ravikumar: కరెంట్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం
ABN , Publish Date - Sep 28 , 2025 | 06:54 PM
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలను మరింతగా తగ్గిస్తామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 28: రానున్న రోజుల్లో మరింతగా విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విద్యుత్ చార్జీలు పెంచకుండా వీలైతే తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని 15 నెలల్లో నిలబెట్టుకున్నామన్నారు. ఆదివారం అమరావతిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. గతంలో జగన్ పెంచిన ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం యూనిట్‌కు 13పైసలు చొప్పున తగ్గించిన ఛార్జీలే కాకుండా.. భవిష్యత్తులో మరింతగా తగ్గించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
ఈ ఏడాది నవంబర్ నుంచి యూనిట్‌కు 13పైసలు మేర విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయని ఆయన వివరించారు. ప్రొవిజనల్ కలెక్షన్ పేరిట 2023 - 24లో యూనిట్ 40పైసలు ధరను జగన్ ప్రభుత్వం ఫిక్స్ చేసిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. దీనిని 13పైసలకు కూటమి ప్రభుత్వం తగ్గించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకుండా షార్ట్ టర్మ్ పవర్ కొనుగోళ్లతో ప్రజలపై భారం మోపిందని విమర్శించారు.
17 శాతం ఉన్న షార్ట్ టర్మ్ పవర్ కొనుగోళ్లను కూటమి ప్రభుత్వం 6.8 శాతానికి తెచ్చిందన్నారు. స్వాపింగ్ విధానం ద్వారా పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో విద్యుత్ ఇచ్చి పుచ్చుకునే దిశగా పని చేస్తున్నామన్నారు. ఏఐ, ఐటీ పరిజ్ఞానం ద్వారా వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేస్తూ విద్యుత్ డిమాండ్ అంచనా వేయగలుగుతున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ఆదాయ వనరుగా మాత్రమే చూసిందని చెప్పారు. విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబుకు అపార అనుభవం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కారణంగా విద్యుత్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఆదాయం సమకూరుస్తున్నారన్నారు. 2014లో లోటు విద్యుత్‌తో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ ప్రయాణం 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించిందని.. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ డిమాండ్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ అవసరాలు తీర్చలేక మళ్లీ లోటు విద్యుత్ అందించిందని విమర్శించారు. 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల మీద నేరుగా రూ. 18 వేల కోట్లు ట్రూ అప్ ఛార్జీలు భారం మోపారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రూ. లక్షా 25 వేల కోట్ల మేర జగన్ విద్యుత్ వ్యవస్థకు నష్టం కలిగించారని వివరించారు.
జగన్ పీపీఏ రద్దు చేయటం వల్ల ఉత్పత్తయిన విద్యుత్‌ను వాడుకో లేక పోయామన్నారు. అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవటంతో రూ. 9వేల కోట్లు పెనాల్టీగా కట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. విద్యుత్ వ్యవస్థను అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత వైఎస్ జగన్‌దేనని ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ కుండ బద్దలు కొట్టారు. 15 నెలలుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అనతికాలంలో విద్యుత్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందన్నారు.
పీఎం సూర్యఘర్, కుసుమ్, బ్యాటరీ స్టోరేజ్ విధానం, డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి పెంచుతూ తీసుకొచ్చిన సంస్కరణలతో ఛార్జీలు తగ్గించగలిగామని వివరించారు. ప్రతీ ఏటా 5 శాతం మేర పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి తగ్గట్టుగా ఉత్పత్తిపైనా దృష్టి సారిస్తున్నామన్నారు. బ్యాటరీ స్టోరేజీ విధానంతో పాటు, స్వాపింగ్ విధానం వంటి వినూత్న విధానాలతో ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ఖర్చుకే ఇస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రుల బృందం.. కీలక నిర్ణయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. స్పందించిన బండారు విజయలక్ష్మీ
For More AP News And Telugu News