AP Minister Narayana In Seoul: దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రుల బృందం.. కీలక నిర్ణయం
ABN , Publish Date - Sep 28 , 2025 | 06:13 PM
ఆంధ్రప్రదేశ్ మంత్రులు పి.నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితోపాటు ఉన్నతాధికారులు ప్రతినిధి బృందం ప్రస్తుతం ఉత్తర కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశంలోని ఉన్నతాధికారులుతో ఈ ప్రతినిధి బృందం సమావేశమవుతుంది.
అమరావతి, సెప్టెంబర్ 28: రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టాల్సిన నిర్మాణాలపై స్పష్టత కోసం మున్సిపల్ మంత్రి పి.నారాయణ సారథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితోపాటు ఉన్నతాధికారుల బృందం తాజాగా దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. అందులో భాగంగా చియాంగ్‌గేచెఒన్ (Cheonggyecheon) వాగును ఆదివారం ఈ బృందం పరిశీలించింది. ఏపీ ఈడీబీ (ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు) ఆధ్వర్యంలో దక్షిణ కొరియా రాజధాని సీయోల్‌లో ఈ బృందం పర్యటిస్తోంది.
90వ దశకంలో పూర్తిగా మురుగునీరు, తీవ్ర కాలుష్య కారకంగా ఈ వాగు ఉండేది. ఆ తర్వాత ఈ వాగును అత్యంత పరిశుభ్రంగా మార్చారు. ఈ నేపథ్యంలో ఈ చియాంగ్‌గేచెఒన్ (Cheonggyecheon)వాగును వారు పరిశీలించారు. 2003– 2005 మధ్య కాలంలో సీయోల్ నగరంలో మెరుగైన వాతావరణం కల్పించడం కోసం చియాంగ్‌గేచెఒన్ ప్రాజెక్టు పునరుద్ధరణకు స్థానిక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో ఈ వాగు పరిసర ప్రాంతాలు అత్యంత ఆహ్లాదకరంగా మార్చింది. మరీ ముఖ్యంగా గతంలో అత్యంత మురికిగా.. కాలుష్య కారకంగా ఉన్న చియాంగ్‌గేచెఒన్ వాగులోని నీరు.. ప్రస్తుతం ఎంతో స్వచ్ఛంగా మారింది. అలాగే ఆ ప్రాంతంలోని గాలి నాణ్యత సైతం పెరిగింది. శబ్ద కాలుష్యం తగ్గింది. తద్వారా జీవవైవిధ్యం మెరుగుపడింది.
మరోవైపు ఈ పర్యటనలో భాగంగా.. నామీ ద్వీపం సీఈవో మిన్ క్యోంగ్ వూ(min keyong woo)తో మంత్రుల బృందం సమావేశమైంది. దక్షిణ కొరియాలో సహజ సిద్ధమైన, సాంస్కృతిక, సంప్రదాయక పర్యాటక ప్రదేశంగా నామీ ఐలాండ్ ఉంది. దేశ రాజధాని సియోల్‌లోనే అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా ఈ ఐలాండ్ వర్ధిల్లుతోంది. ఇక్కడి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లలో ఏడాది పొడవునా సంగీత ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రపంచ పర్యాటకులను ఈ ఐ ల్యాండ్ విశేషంగా ఆకర్షిస్తోంది.
అలాంటి వేళ.. నామీ ద్వీపం అభివృద్ధి, పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై సీఈవోతో మంత్రి నారాయణ ఈ సమావేశంలో చర్చించారు. 4,60,000 చ.మీ. విస్తీర్ణంలో అందమైన చెట్లు, పూల మొక్కలతో పర్యాటకులను ఈ నామీ ద్వీపం విశేషంగా ఆకర్షిస్తుంది. అమరావతిని బ్లూ- గ్రీన్ సిటీగా రూపుదిద్దడంలో నామీ ఐలాండ్‌లో అనుసరించిన విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ బృందం నిర్ణయించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లోని నదులు, కాలువలు, వాగులు కాలుష్య కారకంగా మారాయి. ఈ నేపథ్యంలో వాటిని పునరుద్దరించేందుకు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తుంది. అలాగే అమరావతితోపాటు పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపైనా వారు ఈ పర్యటనలో భాగంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు కన్నబాబు, ఎం. టి. కృష్ణబాబు తదితరులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. స్పందించిన బండారు విజయలక్ష్మీ
For More AP News And Telugu News