Udaan Yatri Cafe In Gannavaram Airport: యాత్రీ కెఫేను ప్రారంభించిన కేంద్ర మంత్రి
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:27 PM
దేశంలో ప్రస్తుతం 160 విమానాశ్రయాలు ఉన్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇన్ని విమానాశ్రయాలు ఉండడం వల్ల.. చిన్న పట్టణాలకు కూడా ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వగలిగామని చెప్పారు. పట్టణాలకు సైతం ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల సామాన్యులు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 29: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రీ కెఫేను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఉడాన్ యాత్రీ కెఫేను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు కెఫేలో కాఫీని ఆయనే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రయాణికుల అభిప్రాయాలను కేంద్ర మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఇలా కాఫీని అందుకోవడం ఆనందంగా ఉందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమ్మ పేరుతో ఒక చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విమానాశ్రయం ఆవరణలో మొక్కను నాటారు.
అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. విమానాశ్రయ అధికారులు, ప్రయాణికులతో కలిసి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు. 10 ఏళ్ల క్రితం దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవన్నారు. ప్రస్తుతం వాటి సంఖ్య 160కి చేరిందని చెప్పారు. ఇన్ని విమానాశ్రయాలు ఉండడం వల్ల.. చిన్న పట్టణాలకూ ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వగలిగామని పేర్కొన్నారు. పట్టణాలకు సైతం ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల సామాన్యులు సైతం విమానాల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు.
ఇక విమానంలో ప్రయాణిస్తున్న సామాన్య ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ సైతం తాము తీసుకున్నామని వివరించారు. విమానాశ్రయాల్లో తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ఈ సందర్భంగా తమకు ఫిర్యాదులు అందాయన్నారు. వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తొలిసారి ఉడాన్ యాత్రీ కెఫేను ముంబై విమానాశ్రయంలో ప్రారంభించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనికి ప్రయాణికుల నుంచి అనుహ్య స్పందన వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ యాత్రీ కెఫేను గన్నవరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, విమానాశ్రయ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
గన్నవరం విచ్చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. సోమవారం విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అలాగే ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను సైతం దర్శించుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ రోజు అమ్మ వారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం కూడా కావడంతో.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. మరోవైపు ఈ రోజు అమ్మవారికి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో.. తెలుసుకునే సింపుల్ చిట్కాలు
తెలంగాణకు ప్రత్యేక స్థానం తెచ్చిన పండగ బతుకమ్మ: ఎమ్మెల్యే హరీశ్ రావు
For More AP News And Telugu News