CM Chandrababu In Durga Temple: విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు..
ABN , Publish Date - Sep 29 , 2025 | 05:01 PM
విజయవాడ దుర్గమ్మ దర్శనార్థం సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సీఎం దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
విజయవాడ, సెప్టెంబర్ 29: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనార్థం సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. భక్తుల కోసం నిర్మిస్తున్న అన్న ప్రసాద భవనం మరో ఆరు నెలల్లో పూర్తవుతుందని చెప్పారు. సోమవారం ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన శ్రీదుర్గమ్మకి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం దేవాలయం బయట సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రూ.25 కోట్లతో 1,500 మంది భక్తులు భోజనం చేసే విధంగా అన్న ప్రసాద భవనం నిర్మిస్తున్నామన్నారు. రూ. 27 కోట్లతో 3 నెలల్లో ప్రసాదం తయారీ కేంద్ర పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. అలాగే రూ.5.5 కోట్లతో ప్రధాన ఆలయం వద్ద పూజా మండపానికి సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టామని సీఎం నారా చంద్రబాబు నాయుడు వివరించారు.
ప్రభుత్వం తరఫున దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు అందించాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. దుర్గమ్మ దయతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని.. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళతో ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని.. రాష్ట్ర సంపద పెరగాలని ఆయన ఆకాంక్షించారు. నవరాత్రుల సందర్భంగా ఇప్పటి వరకూ 8 లక్షల మంది భక్తులు.. దుర్గమ్మ వారిని దర్శించుకున్నారని వివరించారు.
ఈ రోజు ఒక్క రోజే 1.20 లక్షల మంది భక్తులు.. దుర్మమ్మను దర్శించుకున్నారని పేర్కొన్నారు. అమ్మ వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. పవిత్రతను కాపాడుతూ.. అధిక మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రసాదంలో నాణ్యత పెంచామని.. అలాగే వీఐపీ దర్శనాలను క్రమబద్దీకరించామన్నారు. అయితే అమ్మవారి దర్శనాల్లో అధిక సమయం సాధారణ భక్తులకే కేటాయించామని తెలిపారు.
దుర్గమ్మ ఆశీస్సులతో ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దుర్గమ్మ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని చెప్పారు. 2014-19 మధ్య కాలంలోనే దుర్గ గుడి అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నేడు మళ్లీ అభివృద్ది పనులు చేస్తున్నామని వివరించారు. దాతల సహకారంతో యాగశాల నిర్మిస్తామన్నారు. రూ. 14 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ వంటి పనులు చేపట్టామని వీటిని ఐదు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు.
2027 గోదావరి, 2028 కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు దుర్గమ్మ దీవెనలుండాలని పేర్కొన్నారు. దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నామన్నారు. దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. తిరుమల కొండపై ఉన్నంత స్థలం.. ఇంద్రకీలాద్రిపై లేదన్నారు. విజయవాడ నగరంలోనే వసతి ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని.. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని సీఎం వివరించారు. ఆదాయం లేని దేవాలయాలకు ప్రభుత్వం నిధులు అందిస్తుందన్నారు. ప్రముఖ దేవాలయాలకు నగదు కొదవ లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సోమవారం శ్రీసరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే ఈ రోజు మూల నక్షత్రం. అంటే అమ్మవారి జన్మ నక్షత్రం. ఈ నేపథ్యంలో దుర్గమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ పట్టువస్త్రాలు సమర్పించేందుకు మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా మేళ తాళాలు.. మంగళ వాయిద్యాలతో వారికి పూర్ణకుంభంతో వేద పండితులు, ఆలయ అధికారులు, మంత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఈ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆ క్రమంలో అమ్మవారి లడ్డూ ప్రసాదంతోపాటు దుర్గమ్మ చిత్రపటాన్ని చంద్రబాబు దంపతులకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు. సీఎం దంపతులకు స్వాగతం పలికిన వారిలో.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఎంపీ కేశినేని చిన్నితోపాటు పలువురు మంత్రులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో.. తెలుసుకునే సింపుల్ చిట్కాలు
యాత్రీ కెఫేను ప్రారంభించిన కేంద్ర మంత్రి
For More AP News And Telugu News