Digital Corporation Corruption: డిజిటల్ కార్పొరేషన్‌లో అవకతవకలపై అసెంబ్లీలో దుమారం
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:52 PM
డిజిటల్ కార్పొరేషన్‌లో అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు.
అమరావతి , సెప్టెంబర్ 19: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Session) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌లో అవకతవకలపై అసెంబ్లీలో దుమారం చెలరేగింది. డిజిటల్ కార్పొరేషన్‌లో అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ఈ అంశంపై మంత్రిని ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కూన రవికుమార్, తెనాలి శ్రవణ్ కుమార్‌లు నిలదీశారు.
చర్చలు ఎందుకు తీసుకోలేదు: ధూళిపాళ్ల
డిజిటల్ కార్పొరేషన్‌లో అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిపిందని.. ఈ నివేదిక ప్రభుత్వానికి కూడా అందిందని.. కానీ నేటి వరకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే ధూళిపాళ్ల అన్నారు. దీనిపై మళ్ళీ సీఐడీ విచారణకు ఆదేశించారని.. కానీ ఈలోపు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారి ప్రశ్నించారు. చివరకు అక్కడ ఉన్న బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు.
ప్రజాధనం ఎలా మళ్లిస్తారు: కూన రవికుమార్
విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తీసిన యాత్రా సినిమాకు డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు ఎలా చెల్లించారని ప్రశ్నించారు. ప్రజాధనం ఎలా మళ్లిస్తారని అడిగారు. దీనిపై బిజినెస్ రూల్స్ ప్రకారం అధికారులపై ఎందుకు చర్య తీసుకోలేదని నిలదీశారు. పాలనా పరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని సభలో ప్రశ్నించారు. మళ్ళీ సీఐడీ విచారణకు ఎందుకు ఇచ్చారని అడిగారు. కొంతమంది అధికారులను కాపాడేందుకు మరి కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీఐడీ విచారణ ఎప్పుడు పూర్తి కావాలి... అప్పుడు చర్యలు తీసుకుంటారా అంటూ కూన రవికుమార్ ప్రశ్నించారు.
అందులో అవినీతి వాస్తవం: మంత్రి పార్థసారథి
ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి పార్థసారథి సమాధానం ఇస్తూ.. డిజిటల్ కార్పొరేషన్‌లో వైసీపీ ప్రభుత్వ హయంలో అవినీతి జరిగింది వాస్తవమన్నారు. సాక్షి పత్రికలో, ఐ డ్రీమ్‌లో పని చేసిన వారిని డిజిటల్ కార్పొరేషన్‌లో నియమించారని తెలిపారు. యాత్ర సినిమాకు కూడా నిధులు మళ్లించారన్నారు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లించిన జీఎస్టీ కూడా రికవరీకి ప్రయత్నిస్తామని చెప్పారు. డీజీపీ ఏ నేరుగా విజిలెన్స్ ఫిర్యాదుపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
విజిలెన్స్ నివేదిక ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి ప్రశ్నించారు. అసలు బిజినెస్ రూల్స్ ప్రకారం విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉందా? లేదా? అనేది తెలియచేయాలని కోరారు. ఆపై సీనియర్ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. సీఐడీ విచారణకు ఒక నిర్ణీత కాలవ్యవధి నిర్ణయించాలని.. ఆ షెడ్యూల్ ప్రకారం విచారణ పూర్తి చేయాలనిఆయన కోరారు. విజిలెన్స్ నివేదికలో అక్రమాలు గురించి 9 నెలలు క్రితం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ నేటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెనాలి శ్రవణ్ కుమార్ అడిగారు. ఇంకా జీఎస్టీని ఎందుకు రికవరీ చేయలేదన్నారు. అధికారులను కాపాడుతున్నారు అనే సందేహం కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. దీనిపై డీజీపీ స్వయంగా సీఐడీ విచారణకు ఆదేశించారని.. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. అలాగే జీఎస్టీపై రికవరీకి వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి సమాధానం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీ ‘చలో మెడికల్ కాలేజ్’.. టెన్షన్ టెన్షన్
ఏపీ అసెంబ్లీ షెడ్యూల్ కుదింపు.. తాజా మార్పులు ఇవే
Read Latest AP News And Telugu News