CM Chandrababu: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌పై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:38 AM
కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రజెంట్ చేసిన ముస్తాబు కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కలెక్టర్ ఎన్ ప్రభాకర్‌ను సీఎం ప్రశంసించారు.
అమరావతి, డిసెంబర్ 18: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన రెండవ రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సందర్భంగా బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీలపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా పార్వీతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ‘ముస్తాబు’ అనే కార్యక్రమాన్ని సదస్సులో వివరించారు. పరిశుభ్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెంపోందించటమే లక్ష్యంగా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రజెంటేషన్‌పై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కలెక్టర్‌ను ప్రశంసించడంతో పాటు ఆయనపై సీఎం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎవరూ సిఫార్సు చేయలేదు..
పోస్టింగ్ ఇచ్చే సమయంలో ప్రభాకర్ రెడ్డిపై సీనియర్ అధికారులు మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని సీఎం తెలిపారు. ఆయనకు కలెక్టర్ పోస్ట్ ఇవ్వడానికి ఎవరూ సిఫార్సు చేయలేదన్నారు. ‘ప్రభాకర్ రెడ్డి నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు.. నీపై ఎవరూ మంచి ఒపీనియన్ వ్యక్తం చేయడం లేదు.. కానీ పొజిషన్ ఇస్తే ఏం చేస్తావ్ అని అడిగా. ఒక్క అవకాశం ఇవ్వండి, నిరూపించుకుంటా అని ప్రభాకర్ రిక్వెస్ట్ చేశారు. సరే అని ఒక అవకాశం ఇచ్చా, చాలా బాగా పనిచేస్తున్నారు’ అంటూ కొనియాడారు. ముస్తాబు అనే కార్యక్రమాన్ని చేపట్టి పాఠశాలల్లో విద్యార్ధులకు హైజీన్, వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కల్పించి వారి ద్వారా వాళ్ళ ఇళ్లల్లో కూడా పరిశుభ్రతపై మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ బెస్ట్ ప్రాక్టీస్‌ను స్టేట్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అమలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ముస్తాబు ఆకర్షించిదన్న సీఎం...
ముస్తాబు కార్యక్రమం తనను చాలా ఆకర్షించిందని సీఎం తెలిపారు. మన్యం జిల్లాలో విద్యార్థులే ముస్తాబు కార్యక్రమం చాలా బాగుందని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. 79 లక్షల మంది విద్యార్ధులకు చేరేలా ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇది అమలు చేస్తే చిన్నారులకు అలవాటుగా మారుతుందని... అప్పుడు వాళ్ల ఇళ్ల పరిసరాలు కూడా బాగుపడతాయన్నారు. ఆలోచనతోనే ఆదాయం, సంపద సృష్టించే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. చాలా మంది ఏదైనా పని చేయమంటే డబ్బులేవీ అని అడుగుతున్నారని... కానీ నిధుల్లేకుండానే అద్భుతమైన కార్యక్రమాలు చేయవచ్చని... దీనికి ముస్తాబు కార్యక్రమమే ఉదాహరణగా తెలిపారు. సింపుల్ ఇన్నోవేషన్ ఐడియాలతో ప్రభావం ఎక్కువ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
‘ముస్తాబు’పై కలెక్టర్ మాటల్లో....
కలెక్టర్ల సదస్సులో మన్యం జిల్లా కలెక్టర్ ముస్తాబు కార్యక్రమాన్ని వివరించారు. పరిశుభ్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెంపోందించటమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. తద్వారా పాఠశాల పరిసరాలు కూడా శుభ్రంగా మారుతున్నాయని కలెక్టర్ చెప్పారు. విద్యార్ధుల హాజరు కూడా గణనీయంగా పెరుగుతోందని వివరించారు. రోగాల బారిన పడిన విద్యార్ధుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని వివరించారు. ముస్తాబు కార్యక్రమంపై రూపొందించిన వీడియోను ఈ సదస్సులో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రదర్శించారు.
ఇవి కూడా చదవండి...
SBI బ్యాంకులో నకిలీ నోట్ల కలకలం..!
భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే
Read Latest AP News And Telugu News