Share News

CM Chandrababu: అవి ప్రభుత్వ కాలేజీలే.. మెడికల్ కళాశాలలపై సీఎం చంద్రబాబు స్పష్టత

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:39 AM

పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా.. అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం ప్రసంగించారు.

CM Chandrababu: అవి ప్రభుత్వ కాలేజీలే.. మెడికల్ కళాశాలలపై సీఎం చంద్రబాబు స్పష్టత
CM Chandrababu

అమరావతి, డిసెంబర్ 17: పీపీపీ పద్ధతిన మెడికల్ కాలేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) స్పష్టతనిచ్చారు. కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయని స్పష్టం చేశారు. వైద్య కళాశాలలు ప్రైవేటుపరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా.. అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని క్లారిటీ ఇచ్చారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని తెలిపారు. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయని.. సీట్లు కూడా పెరిగాయని చెప్పుకొచ్చారు.


రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని మండిపడ్డారు. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించే వాళ్లమన్నారు. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్‌గా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని తెలిపారు. విమర్శలు చేస్తే భయపడేది లేదని.. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలని అన్నారు. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారని... కానీ అది ప్రైవేటు వ్యక్తులది అయిపోతుందా అని ప్రశ్నించారు.


గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయని.. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవారని గుర్తుచేశారు. అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని.. 13-14 శాతంతో అప్పులు తీసుకువచ్చి సమస్య సృష్టించారని విమర్శించారు. అనాలోచిత ధోరణితో ఎస్టాబ్లిష్‌మెంట్ వ్యయం భారీగా చేశారని తెలిపారు. ఇప్పుడు అప్పులు రీ-షెడ్యూలు చేస్తున్నామని.. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికతో అప్పులను రీ-షెడ్యూలింగ్ చేస్తున్నామని సీఎం వెల్లడించారు.


ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలి...

జిల్లాల కలెక్టర్ల సదస్సులో మొక్కుబడి చర్చలు కాకుండా అర్థవంతమైన సమీక్ష, చర్చలు జరగాలని సీఎం అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలని.. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలని సూచించారు. ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని తెలిపారు. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నామన్నారు. నిర్దేశించిన లక్ష్యాల ద్వారా ఫలితాలు ఎలా వస్తున్నాయన్నదే ముఖ్యమని సీం అన్నారు. వ్యవస్థలో ఉండే లోపాలను గుర్తించి వాటిని వినియోగించి పని నుంచి తప్పించుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. రెవన్యూ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని... ఫైళ్లను పరిష్కరించుకుండా తమ వద్ద నుంచి వేరే వారికి పంపించేస్తున్నారని మండిపడ్డారు.


కానిస్టేబుళ్లకు నియామకపత్రాలు ఇవ్వడంపై..

ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలని.... డేటా డ్రైవెన్ గవర్నెన్సు ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. మనం చక్కగా ప్రజలకు సేవలందిస్తున్నామని... కానీ మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లోటు పాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందన్నారు. 5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించిందని సీఎం తెలిపారు. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారని.. ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే... తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించారని చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చినా... పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని కొనియాడారు. మంత్రి లోకేష్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారని.. ప్రతీ శాఖ ఆన్‌లైన్ ద్వారా ఫైళ్లు నడపాలి సేవలు అందించాలని సూచించారు. గత పాలకుల నిర్వాకం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయాయని... వాటిని తిరిగి ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

కలెక్టర్ల కాన్ఫరెన్స్... డేటా డ్రైవెన్ గవర్నెన్స్‌పై సీఎం ఫోకస్

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కీలక సూచనలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 17 , 2025 | 12:00 PM