Share News

CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర నా బాధ్యత..

ABN , Publish Date - Oct 06 , 2025 | 07:47 PM

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛతా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర నా బాధ్యత..
CM Chandrababu Naidu

విజయవాడ: స్వచ్ఛత కోరుకునే ప్రతిఒక్కరూ సేవకులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశుభ్రతకు నిత్యం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని ఆయన తెలిపారు. స్వచ్ఛతను గాంధీజీ దైవంతో పోల్చారని గుర్తు చేశారు. పారిశుద్ధ్య కార్మికుల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడొద్దని విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే స్వచ్ఛ ఉద్యమం లేదు, స్వచ్ఛ ఆరోగ్యం లేదని చంద్రబాబు నొక్కిచెప్పారు.


విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛతా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ స్వచ్ఛతను పాటించడంలో అగ్రస్థానంలో ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు అవార్డులు ప్రదానం చేశారు చంద్రబాబు. 69 రాష్ట్రస్థాయి, 1,257 జిల్లాస్థాయి విజేతలకు అవార్డులు అందించారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, పరిశ్రమలు, స్కూళ్లు, ఆస్పత్రులు, స్వచ్ఛాంధ్ర సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు అవార్డులు ఇచ్చారు. మొత్తంగా 21 కేటగిరిల్లో స్వచ్ఛతా అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు..


అపరిశుభ్రంగా ఉంటే మనం ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ కార్మికులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటారని చెప్పారు. అందుకే వారంటే తనకు చాలా గౌరవమని స్పష్టం చేశారు. అనంతరం చంద్రబాబు వారికి చేతులెత్తి నమస్కారం చేశారు. మొదటిసారి తాను ముఖ్యమంత్రి అయినప్పుడు పచ్చదనం పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. స్వచ్ఛభారత్ ఏ విధంగా ఉండాలనే దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కమిటీ ఏర్పాటు చేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా మంత్రి నారాయ‌ణ‌పై సీఎం చంద్రబాబు ప్రశంస‌లు కురిపించారు. కంగ్రాట్స్ నారాయ‌ణ అంటూ సభాముఖంగా అభినంద‌న‌లు తెలిపారు. రాష్ట్రంలో పేరుకుపోయిన 85 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల చెత్తను ఏడాదిలోనే మొత్తం క్లీన్ చేసినందుకు మంత్రి నారాయ‌ణ‌కు, మున్సిప‌ల్ శాఖ‌కు అభినంద‌న‌లంటూ వ్యాఖ్యానించారు. గ‌తేడాది అక్టోబ‌ర్ 2కు రాష్ట్రంలో 85 ల‌క్షల ట‌న్నుల లెగ‌సీ వేస్ట్ పేరుకుపోయి ఉంద‌ని గుర్తుచేశారు.

ఏం చేస్తారో తెలియదు.. కానీ వ‌చ్చే అక్టోబ‌ర్ 2కు మాత్రం చెత్త పూర్తిగా ఎత్తేయాల్సిందే.. ఎలా ఊడుస్తారో ఊడ్చకోమ‌న్నానని చెప్పినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. దృఢ సంక‌ల్పంతో ప‌నిచేసిన నారాయ‌ణ‌కు అభినంద‌న‌లు అంటూ.. ప్రశంస‌లు కురిపించారు. ఈ అక్టోబ‌ర్ 2 కంటే 15 రోజుల ముందుగానే మంత్రి నారాయ‌ణ ఆధ్వర్యంలో 85 లక్షల మెట్రిక్ ట‌న్నుల లెగ‌సీ చెత్తను విజ‌యవంతంగా తొల‌గించారని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, కొలుసు పార్థసారథి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య, పలువురు ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Updated Date - Oct 06 , 2025 | 08:01 PM