Share News

Botsa Slams Ministers: మంత్రులవి అర్థంలేని సమాధానాలు.. అందుకే వాకౌట్

ABN , Publish Date - Sep 18 , 2025 | 02:33 PM

50 ఏళ్లకే ఫించన్ అన్నారని.. అదే అడిగితే దానికి సమాధానం లేదని బొత్స అన్నారు. ప్రశ్న అడిగితే ఏవేవో సమాధానాలు చెప్తున్నారని మండిపడ్డారు.

Botsa Slams Ministers: మంత్రులవి అర్థంలేని సమాధానాలు.. అందుకే వాకౌట్
Botsa Slams Ministers

అమరావతి, సెప్టెంబర్ 18: ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నలకు చాలా బాధ్యతరాహిత్యంగా సమాధానాలు వచ్చాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (MLC Botsa Satyanarayana) విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. చాలా నిర్లక్ష్యంగా మంత్రుల సమాధానాలు ఉన్నాయని.. మంత్రులంతా అదే తీరు అంటూ మండిపడ్డారు. 50 ఏళ్లకే ఫించన్ అన్నారని.. అదే అడిగితే దానికి సమాధానం లేదన్నారు. ఒక ప్రశ్న అడిగితే ఏవేవో సమాధానాలు చెప్తున్నారని బొత్స మండిపడ్డారు. మద్యం అమ్మకాల మీద సభ్యులు అడిగిన ప్రశ్నలకు డొంకతిరుగుడు సమాధానాలు చెప్పారన్నారు.


కల్తీ మద్యం, బెల్ట్ షాప్‌ల విషయంలోనూ అదే అర్థం లేని మాటలని అన్నారు. తిరుపతి, సింహాచలం దేవస్థానాల్లో జరిగిన రెండు దుర్ఘటనల గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పలేదని విమర్శించారు. దానికి కూడా జగనే వచ్చి హడావిడి చేశారు అని రివర్స్‌లో వాదనకు దిగుతున్నారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని తాము ప్రశ్నలు అడిగితే వ్యంగ్యంగా సమాధానాలు చెప్తున్నారన్నారు. దేవస్థానాల్లో జరిగిన ఆ రెండు ఘటనలకు బాధ్యులు లేరా? చర్యలు తీసుకోరా? దాని మీద మాట్లాడరా? అంటూ ప్రశ్నిస్తూ... అందుకే వైసీపీ సభ్యులంతా వాక్ ఔట్ చేసి వచ్చినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.


దేవాలయాల భద్రత విషయంలో మాట్లాడినప్పుడు ఎంత హుందాగా ఉండాలంటూ హితవుపలికారు. ఈ ప్రభుత్వానికి దేవుడితో పనిలేదని.. భక్తుల మనోభావాలతో పనిలేదన్నారు. రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలపై అడిగితే తాము చర్చకు అంగీకరించలేదా అని ప్రశ్నించారు. మండలిలో జరిగే ప్రతీ చర్చ కూడా ప్రజలకు మంచి చేకూర్చేలా ఉండాలని.. కానీ మండలిలో ఆ పరిస్థితి లేదన్నారు. దేవాలయాల విషయంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాక్ ఔట్ చేశామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

పెన్షన్‌లు తొలగించలేదు.. ప్రచారాలు మానండి.. వైసీపీపై మంత్రి ఫైర్

తొలిసారి మండలికి నాగబాబు.. పవన్ దిశానిర్దేశం]

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 02:34 PM