AP Liquor Scam: ఈడీ ఎంట్రీ.. రాజ్ కసిరెడ్డి వ్యవహారంపై ఆరా
ABN , Publish Date - Sep 18 , 2025 | 01:47 PM
ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చోటు చేసుకున్న కీలక పరిణామాలపై ఆరా తీయడమే కాదు.. పలు నగరాల్లో సోదాలు సైతం నిర్వహిస్తోంది.
అమరావతి, సెప్టెంబర్ 18: జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ. 3, 500 కోట్ల మేర స్కాం జరిగిందంటూ సిట్ అధికారులు నిగ్గు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే పలువురు నిందితులు.. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు అరెస్ట్ అయి.. బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సైతం బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాంటి వేళ.. ఈ మద్యం కుంభకోణంలో దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయింది. ఆ క్రమంలో చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు గురువారం ముమ్మర దాడులు నిర్వహించారు. దాదాపు 10 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
మరి ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆస్తులపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. మద్యం వ్యవహారంలో పొందిన ముడుపులను షెల్ కంపెనీలకు పంపిన తద్వారా నల్ల ధనాన్ని వైట్‌గా మార్చారంటూ ఇప్పటికే రాజ్ కసిరెడ్డిపై సిట్ నిగ్గు తేల్చింది.
అయితే ఈ వ్యవహారానికి సంబంధించి.. సిట్ నుంచి ఈడీ సీనియర్ అధికారులు అందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మూడు రోజుల క్రితమే తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 23 సూట్ కేసు కంపెనీలలో జరిగిన లావాదేవీలపై ఈడీ ఈ సందర్భంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటి వరకు సిట్ దాఖలు చేసిన చార్జిషీట్‌లోని నిందితుల ఆస్తులు, కంపెనీలపై సైతం ఈడీ దృష్టి సారించింది. అదే విధంగా హైదరాబాద్‌లో సిట్ స్వాధీనం చేసుకున్న రూ. 11 కోట్ల నగదు వివరాలను సైతం ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ దాడుల సమయంలో ఎప్పటికప్పుడు సిట్ అధికారులతో సంప్రదిస్తూ.. తమకున్న సందేహాలను ఈడీ అధికారులు నివృత్తి చేసుకుంటున్నారని సమాచారం. కొద్దిసేటిలో తిరుపతి, హైద్రాబాద్‌లోని మరి కొన్ని కంపెనీలపై కూడా ఈ దాడులు చేసేందుకు మరిన్ని బృందాలు ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలు దేరినట్లు తెలుస్తుంది. అందుకోసం ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు తిరుపతిలో పలు బృందాలు ఎదురు చూస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. రైతులకు ముందే పండగ..
బ్రెయిన్ ఈటింగ్ అమీబా రాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటిస్తే..
For More AP News And Telugu News