Share News

Festival Bonanza To Farmers: గుడ్ న్యూస్.. రైతులకు ముందే పండగ..

ABN , Publish Date - Sep 18 , 2025 | 01:06 PM

రాష్ట్రంలోని రైతులు.. ఒకే సారి డబుల్ జాక్ పాట్ కోట్టేయనున్నారు. అక్టోబర్‌లో దసరా వెళ్లిన కొద్ది రోజులకే దీపావళి వస్తుంది. ఈ దీపావళి పండగ వేళ.. మరో పండగ లాంటి శుభవార్త రైతుల ఇంటి తలుపు తట్టింది.

Festival Bonanza To Farmers: గుడ్ న్యూస్.. రైతులకు ముందే పండగ..
Farmers diwali bonanza

అమరావతి, సెప్టెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రైతులు మళ్లీ డబుల్ జాక్‌పాట్ కొట్టబోతున్నారు. అదికూడా వెలుగులు పండగ దీపావళి వేళ.. వారికి డబుల్ బొనాంజా తగలబోతుంది. ఈ ఏడాది ఆగస్టులో వచ్చినట్లుగానే.. ఒకే సారి ప్రధాన మంత్రి కిసాన్ నిధులు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయని తెలుస్తోంది. జులైలో విడుదల చేయాల్సిన పీఎం కిసాన్ నిధులు.. నెల రోజులు ఆలస్యంగా అంటే.. ఆగస్టులో విడుదల చేశారు. కానీ ఈ సారి ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అక్టోబర్‌ మాసంలో 21వ పీఎం కిసాన్ యోజన పథకం తాలుకు నిధులు రైతుల ఖాతాల్లో వేయనుంది. అలాగే కూటమి ప్రభుత్వం సైతం అదే బాటలో పయనిస్తుందని తెలుస్తుంది.


అదీకాక.. ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధులతోపాటు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నిధులు అక్టోబర్‌లో జమకానున్నాయి. అంటే.. దీపావళికి ముందే అక్టోబర్ 18వ తేదీన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది.


కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఏటా రూ. 14 వేలు ఇచ్చి ఆర్థిక తోడ్పాటు అందిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన విషయం విదితమే. అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కాస్తా ఆలస్యంగా ప్రారంభించింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రూ. 14 వేలు మూడు విడతలుగా జమ చేస్తామని.. అది కూడా పీఎం కిసాన్‌తోనే వేస్తామని ప్రకటించింది.


ఇప్పటికే ఆగస్టులో రూ. 5 వేల అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. తాజాగా మరో విడతకు సంబంధించిన నిధులు సైతం జమ చేసేందుకు సిద్ధమవుతోంది. దాంతో దీపావళి వేళ ఒక్కో రైతు ఖాతాలో రూ. 7 వేల జమ కానున్నాయి. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత నిధులను సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వీరాయ పాలెంలో ప్రారంభించారు. అలాగే రెండో విడత నిధుల జమ కార్యక్రమం ఎక్కడ విడుదల చేస్తారనేందుకు వేదికపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.


అయితే పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ. 20 వేలు మేర రైతులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 14 వేలు వేస్తే.. కేంద్రం రూ. 6 వేలు వేయనుంది.

Updated Date - Sep 18 , 2025 | 01:16 PM