MLA Adinarayana Reddy: రాష్ట్రం నుంచి జగన్‌ను తరిమికొట్టాలి..
ABN , Publish Date - Nov 05 , 2025 | 02:03 PM
ఏపీకి పట్టిన దరిద్రం జగన్ అని ఎమ్మెల్యే ఆదినారాయణ విమర్శించారు. రాష్ట్రం నుంచి జగన్‌ను పూర్తిగా తరిమికొట్టాలని పేర్కొన్నారు.
విజయవాడ: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని.. అలాగే జగన్‌కూ సూపర్ చెక్ పెట్టబోతున్నామని చెప్పారు. జగన్‌కు అధోగతి తప్పదన్నారు. జగన్ బతుకును ఘోరం చేస్తామంటూ ధ్వజమెత్తారు. ప్రజలే ఛీ కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని విమర్శించారు. భారతి రెడ్డి రూ.400 కోట్లు బంగారం కొన్నారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో జగన్.. భారతి రాజ్యాంగాన్ని అమలు చేశారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. పులివెందుల ఎన్నికలలో జగన్‌ను ప్రజలు తరమికొట్టారని పేర్కొన్నారు. బడ్జెట్ అంటే అక్షయపాత్ర కాదు.. కల్పతరువు కాదు.. ఆ మాత్రం తెలియకుండా జగన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గూగుల్ డేటా సెంటర్ వస్తే జగన్ ఓర్వలేక పోతున్నారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంతోమంది పాత్ర ఉందని చెప్పారు. అసలు దోషులు దాగి ఉన్నారు.. వారికోసం సీబీఐకి కేసు అప్పగించాలని సూచించారు. వైఎస్ వివేకానంద రెడ్డిని తాను, బీటెక్ రవి, సతీష్ రెడ్డి కలిసి చంపామని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లిక్కర్ కేసులో కూడా జగన్ రెడ్డి పాత్ర ఉందని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. అప్పులు, తప్పులు, పెద్ద గొప్పలు.. ఇదే జగన్ తీరు అని ఎద్దేవా చేశారు. ఉద్యోగులతో టాయిలెట్‌లు కడిగించారు, మద్యం అమ్మించారని.. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదన్నారు. మూడేళ్లల్లో ఏపీ అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీకి పట్టిన దరిద్రం జగన్ అని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం నుంచి జగన్‌ను పూర్తిగా తరిమికొట్టాలన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి మాటలు చూసి అయినా వైసీపీ నేతలు సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. జగన్‌తో పాటు అనేక మంది జైలుకు పోవడం ఖాయమని స్పష్టం చేశారు. అవినాష్ రెడ్టి త్వరలోనే జైలుకు వెళ్తారన్నారు. ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలనేదే జగన్ ఆకాంక్షని విమర్శించారు.
ప్రజల్లోనే కాదు, చెల్లెళ్లతో కూడా జగన్ ఛీ కొట్టించుకున్నారని ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు డబ్బులు, పదవి ఉంటే చాలు... ధర్మం, న్యాయం అవసరం లేదని ఆరోపించారు. అందుకే పద్దతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధర్మ సంస్కృతి కూటమి ప్రభుత్వానిది... ధర్మ వికృతి జగన్ ది అని విమర్శించారు. మోదీ మూడు సార్లు ప్రధాని కావడంతో మన దేశానికి విశ్వఖ్యాతి దక్కిందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.
Also Read:
నేడు కార్తీక పౌర్ణమి.. ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షమే..
గుడ్ న్యూస్.. మరింతగా తగ్గిన బంగారం, వెండి ధరలు