CM Chandrababu: 2047 నాటికి నెంబర్ వన్ కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:21 PM
వాజ్‌పేయి శతజయంతిని పురస్కరించుకుని చేపట్టే ‘అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన’ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషమన్నారు.
అమరావతి, డిసెంబర్ 9: వాజ్ పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా ‘అటల్ సందేశ్... మోదీ సుపరిపాలన’ యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అభినందనలు తెలియజేశారు. ఈరోజు (మంగళవారం) ఎన్డీయే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చేపట్టే ‘అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన’ యాత్రలో పాల్గొనాలని నేతలకు పిలుపునిచ్చారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషమన్నారు. దేశంలో సుపరిపాలనకు వాజ్‌పేయి నాంది పలికారని... ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాదిని వేశాయని గుర్తుచేశారు. వాజ్ పేయి అజాత శత్రువని, ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారని అన్నారు.
ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్ పేయి.. కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. 9 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తోందని సీఎం వెల్లడించారు. 18 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని.. 1998లో పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి భారతదేశ శక్తిని చాటారని కొనియాడారు. కార్గిల్ యుద్ధంతో శత్రువుకు తిరుగులేని సమాధానం ఇచ్చారన్నారు. వాజ్ పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశ దశ దిశ మార్చిందన్నారు. తనకు వ్యక్తిగతంగా కూడా ఆయనతో అనుబంధం ఉందని.. రాష్ట్రాభివృద్ధిలో ఆయన నాడు ఎంతో సహాయం చేశారని తెలిపారు. రాష్ట్రం కోసం ఏది అడిగినా కాదనేవారు కాదన్నారు.
ప్రజలకు పనికొచ్చే పనులు ఏం చెప్పినా చేస్తారని.. పాలసీల రూపకల్పన గురించి చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. టెలీ కమ్యూనికేషన్ రంగం, విమానయాన రంగంలో సంస్కరణలకు నాంది పలికారన్నారు. సుపరిపాలన ఏ విధంగా ఉండాలో ఎన్టీఆర్, వాజ్ పేయిను చూస్తే అర్థమవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ కూడా విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని... పట్టుదల, అనునిత్యం మంచి చేయాలనే ఆలోచనతో ఉండేవారని ముఖ్యమంత్రి అన్నారు. నాడు అణు పరీక్షలు అయినా, నేడు సింధూర్ అయినా... నాడు చతుర్భుజి అయినా నేడు సాగరమాల అయినా అవి ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశాన్ని 2047కు నెంబర్ వన్ చేసేందుకు పని చేస్తున్నారన్నారు. 2047 నాటికి ఇండియా, ఇండియన్స్ నెంబర్ వన్ స్థానానికి వెళ్తారని ధీమా వ్యక్తం చేశారు. వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని... ‘అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన’ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
అమెరికా టూర్‌లో లోకేష్ బిజీ.. ఓప్స్ ర్యాంప్ సీఈవోతో కీలక చర్చలు
రోడ్డు ప్రమాదంలో తిరుచానూరు ఆలయ పోటు కార్మికులు మృతి
Read Latest AP News And Telugu News