Share News

AP Govt Cotton Farmers: పత్తి రైతులకు సర్కార్ శుభవార్త.. రేపటి నుంచే

ABN , Publish Date - Oct 28 , 2025 | 02:38 PM

మొంథా తుపాను తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ, సంబంధిత అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

AP Govt Cotton Farmers: పత్తి రైతులకు సర్కార్ శుభవార్త.. రేపటి నుంచే
AP Govt Cotton Farmers

అమరావతి, అక్టోబర్ 28: రాష్ట్రంలో పత్తి రైతులకు ఏపీ ప్రభుత్వం (AP Govt) శుభవార్త చెప్పింది. రేపటి (బుధవారం) నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకానున్నాయి. పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,100గా నిర్ణయించారు. రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు రేపటి నుంచి ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మొంథా తుపాను తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ, సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.


2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు అయింది. సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలుకు రూ. 8,110/- కనీస మద్దతు ధరను రైతులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పత్తి అమ్ముకోవాలనుకునే రైతులు కొనుగోలు ప్రక్రియను సక్రమంగా పాటించాలని సూచించారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ) ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆ తర్వాత ‘కపాస్ కిసాన్’ యాప్‌లో అదే వీఏఏ సహాయంతో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.


స్లాట్ ప్రకారం సీసీఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి కొనుగోలు కేంద్రాల ద్వారా (జిన్నింగ్ మిల్లుల ద్వారా) మాత్రమే పత్తిని అమ్ముకోవాలని మంత్రి కోరారు. ఇందు కోసం జిల్లా వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారులు దిగువ స్థాయి సిబ్బందికి తగు సూచనలు ఇస్తూ వీఏఏలు రైతులకు పూర్తి సహకారం అందించేలా పర్యవేక్షించాలన్నారు. పత్తి కొనుగోలును విజయవంతంగా పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 04:15 PM