Kollu Ravindra Cyclone Montha: తప్పనిసరి అయితేనే బయటకు రండి.. ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర సూచన
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:11 PM
సముద్ర తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారని.. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
కృష్ణా, అక్టోబర్ 28: మచిలీపట్నంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra), ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ (RTC Chairman Konakalla Narayana) పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉండబోతుందన్నారు. ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉండటంతో వంద కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో భారీ వర్షం కురుస్తోందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తమకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని వెల్లడించారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులందరూ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ప్రజలకు తగిన సూచనలు ఇస్తున్నారని మంత్రి తెలిపారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారని.. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా బియ్యంతో పాటు ప్రజలకు 3000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నామని తెలిపారు. మంత్రి నారా లోకేష్ సీఎంవో నుంచి రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలిస్తూ అక్కడి నుంచే ఆయా జిల్లాలకు సూచనలు చేస్తున్నారని చెప్పారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని వివరించారు. ప్రజలు కూడా తప్పనిసరి అయితేనే బయటికి రావాలని కోరారు.
రెండు రోజులు ఈ భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. నిర్లక్ష్యంతో ఉండి ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. పురాతన ఇళ్లు, చెట్లు కింద ఉండవద్దని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు వినతి చేశారు. కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చినా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
గంటకు 12 కి.మీ వేగంతో దూసుకొస్తున్న మొంథా
మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు
Read Latest AP News And Telugu News