AP DGP: 2025 వార్షిక నేర నివేదిక విడుదల.. ఏపీ క్రైం రేట్‌పై డీజీపీ మాటల్లో
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:56 PM
2025 సంవత్సరానికి గాను వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు. నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరాలను మరింత తగ్గించేలా నూతన ఏడాదిలో పోలీసులు పని చేస్తారన్నారని ఈ సందర్భంగా డీజీపీ తెలిపారు.
అమరావతి, డిసెంబర్ 29: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీలో క్రైం రేటు బాగా తగ్గిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) తెలిపారు. 2025 సంవత్సరానికి గాను వార్షిక నేర నివేదికను ఈరోజు (సోమవారం) ఏపీ డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ, మత్తు పదార్ధాల రవాణా, సెల్‌ఫోన్లు రికవరీ వంటి అనేక వాటిలో మంచి పురోగతి సాధించామని చెప్పుకొచ్చారు. నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలను మరింత తగ్గించేలా నూతన ఏడాదిలో పోలీసులు పని చేస్తారన్నారు. వచ్చే పదేళ్లల్లో పోలీసింగ్ ఎలా ఉంటుందనే దానిపై వర్క్‌షాపు నిర్వహిస్తున్నామని అన్నారు. పోలీసు విధుల్లో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, ఎలా అందిపుచ్చుకోవాలో వివరిస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ వర్క్‌షాపు ఉంటుందని వెల్లడించారు.
చర్యలు తప్పవు...
అలాగే ఇటీవల కీలక కేసులను కూడా ప్రస్తావిస్తూ.. ఎలా చేధించారో వివరిస్తామని తెలిపారు. సరికొత్త పోలీసింగ్ కనిపించేలా ఈ వర్క్‌షాపు ద్వారా అందరికీ తెలియచేస్తామన్నారు. అప్పా ఒక్కటే మనకు పెండింగ్‌లో ఉందని.. దానిపై త్వరలోనే ప్రకటన వస్తుందని తెలిపారు. చట్టానికి అందరూ సమానమే అని.. వ్యతిరేకంగా వెళ్లేవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందులో విజయం, అపజయం ఉండదని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవమే తమ విధి అని స్పష్టం చేశారు. సేఫ్ ఏరియా అనుకుని కొంతమంది నక్సలైట్లు ఏపీలోకి వచ్చారని.. కానీ ఎప్పటికప్పుడు తాము నిఘా ఉంచి వారందరినీ పట్టుకున్నామన్నారు.
అది వాస్తవం కాదు...
సైబర్ నేరాలకు సంబంధించి చైనాలో పెద్ద గ్యాంగ్స్ ఉన్నాయని తెలిపారు. మోసం జరిగిన వెంటనే ఆ దేశానికి నగదు వెళ్లిపోతుందని చెప్పారు. అందుకే ఇటువంటి కేసులలో నగదు వాపస్ అనేది చాలా కష్టమైన పని అని తెలియజేశారు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రం ఇచ్చిన నివేదిక ప్రకారం 36వ స్థానంలో ఏపీ ఉందనే వార్తలు వాస్తవం కాదని తేల్చిచెప్పారు. అది పాత సిస్టమ్ అని.. మన డేటాకు, వారి డేటాకు మధ్య ఉన్న తేడా వల్ల అలా వచ్చిందన్నారు. అప్పుడు వారి డ్యాష్ బోర్డులో తప్పు ఉందని తాము వారికి లేఖ రాశామని అన్నారు. ఇప్పుడు చూడండి.. డ్యాష్ బోర్డులో ఏపీ ఎక్కడ ఉందో తెలుస్తుందని తెలిపారు.
మహిళలకు ఎల్లప్పుడూ రక్షణగా...
మహిళలకు రక్షణ , గంజాయి రవాణ, నేరాల నియంత్రకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. అక్కడక్కడా మహిళలపై వేధింపులు కేసులు నమోదు అవుతుంటాయని.. ఆలయాల వద్దకు లక్షల్లో వెళ్లే భక్తుల్లో ఎక్కడో వేధింపు ఘటన ఉంటుందన్నారు. అన్నీ జనరలైజ్ చేసి చూడకూడదని.. కానీ తాము ఎప్పుడూ మహిళలకు రక్షణగానే ఉంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.
ఆ లక్ష్యంతోనే...
నకలైట్ల కార్యకలాపాలపై దృష్టి పెట్టామని డీజీపీ తెలిపారు. ఇటీవల కీలక వ్యక్తులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని.. అనేక మందిని అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. పేకాట క్లబ్‌లు నిర్వహించడం నేరమని... అందుకే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని జూదాలు నిర్వహించకూడదన్నారు. ఇటీవల నిందితులను రోడ్లపై నడిపంచడంపై డీజీపీ స్పందించారు. కోర్టులో హాజరు పరిచే సమయానికి పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో లేవని.. దీంతో కొన్ని చోట్ల నిందితులను నడిపిస్తూ కోర్టుకు తీసుకువెళుతున్నారని వివరణ ఇచ్చారర. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలనే లక్ష్యంతోనే పోలీసులు పని చేస్తున్నారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
అప్సా ఎన్నికల పోలింగ్.. సచివాలయంలో సందడి
21 అంశాల అజెండాగా ఏపీ మంత్రి మండలి సమావేశం
Read Latest AP News And Telugu News