CM Chandrababu: ఎకనామిక్ టైమ్స్ అవార్డుపై సీఎం చంద్రబాబు రియాక్షన్
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:10 PM
‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇలాంటి అవార్డులు తాను ఎప్పుడూ తీసుకోలేదని అన్నారు.
అమరావతి, డిసెంబర్ 18: ప్రతిష్టాత్మకమైన ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును (CM Chandrababu Naidu) ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డుపై కలెక్టర్ల సదస్సులో సీఎం స్పందించారు. ఈ తరహా అవార్డులు ఎప్పుడూ తాను తీసుకోలేదని.. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా తన సహచరులు, అధికారులు, కలెక్టర్లదే అని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో గతంలో గుజరాత్ మొదటిస్థానంలో నిలిచిందని... ఆ తర్వాత ప్రతీ ఏడాది ఏపీనే అగ్రస్థానంలో నిలిచిందని సీఎం చెప్పుకొచ్చారు.
ఎన్నిసార్లు నిబంధనలు మార్చినా ఏపీనే నెంబర్ వన్‌గా ఉందన్నారు. ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని సీఎం తెలిపారు. 18 నెలల్లో 25 పాలసీలను తీసుకువచ్చి పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకువస్తున్నామన్నారు. ప్రతీ నెలా ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీల ద్వారా పెట్టుబడులకు ఆమోదం తెలియచేస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారని.. ఇక కేంద్రం ఇస్తున్న సహకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరువకూడదని ముఖ్యమంత్రి వెల్లడించారు.
గత ప్రభుత్వంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలుగుతారా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని.. రాష్ట్రాన్నిపునర్నిర్మిస్తామని చెప్పాం.. చేసి చూపిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు, పరిశ్రమలు ఏపీని విశ్వసిస్తున్నాయన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం తీసుకురాని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాను తీసుకువచ్చామని.. దీనికి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. లేబర్ కోడ్ గైడ్ లైన్స్ విషయంలోనూ కేంద్రం ఏపీని సంప్రదించిందన్నారు. అందుకే ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌ను అమలు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సీఎంకు ఎకనామిక్ టైమ్స్ అవార్డుపై లోకేష్ ట్వీట్...
అందుకే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాం: కోటంరెడ్డి
Read Latest AP News And Telugu News