AP Cabinet Meeting: కేబినెట్ భేటీకి సన్నద్ధం.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:21 PM
రేపటి కేబినెట్ సమావేశంలో రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
అమరావతి, అక్టోబర్ 9: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం రేపు (శుక్రవారం) ఉదయం 10:30 గంటలకు ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దేశ చరిత్రలోనే ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రేపటి కేబినెట్ సమావేశంలో రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే అమరావతిలో రూ.212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్‌భవన్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. కృష్ణా నదీ ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరుగనుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏ ఇచ్చేందుకు ఆమోదించనుంది కేబినెట్. రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి.. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు కేబినెట్ ఓకే చెప్పనుంది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీగా సీఆర్డీఏ వ్యవహరించేలా ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
అంతేకాకుండా.. హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదించే ఛాన్స్ ఉంది. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది కేబినెట్. పలు సంస్థలకు భూ కేటాయింపులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది.
ఇవి కూడా చదవండి...
త్వరలోనే ఆర్డీటీపై పాజిటివ్ వార్త: మంత్రి పయ్యావుల
భగవంతునికి భక్తుడికి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తా: సుమంత్ రెడ్డి
Read Latest AP News And Telugu News