Chandrababu Naidu In Vijayawada Utsav: వాళ్లంతా.. మూడేళ్లలో రాజధాని అమరావతికి తిరిగి వస్తారు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 02 , 2025 | 09:52 PM
విజయవాడ ఉత్సవ్ ముగింపు సభలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని ట్రాక్‌లో పెట్టామని ప్రకటించారు. రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు.
విజయవాడ, అక్టోబర్ 02: రాజధాని అమరావతి పనులను ట్రాక్‌లో పెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీంతో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉపాధి కోసం విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు.. మరో మూడేళ్లలో రాజధానికి తిరిగి వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
గురువారం విజయవాడ ఉత్సవ్ ముగింపు సభకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ వర్గానికీ సంతోషం లేదని విమర్శించారు. గత వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప ఏమీ లేదన్నారు.
కూటమి విజయంతో ఏపీలో ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల.. ఎక్కువ మంది విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారని చెప్పారు. తాను ఏదైతే ఆశించానో అది విజయవాడలో జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఆనందం లేదని.. ఎక్కడ చూసినా దాడులు విధ్వంసాలతో ఇబ్బందులు పెట్టారన్నారు. సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. గత ఐదేళ్లు కూడా టీడీపీ అధికారంలో ఉండి ఉంటే.. 2020 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసే వారమన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఉత్సవ్ హైలైట్స్‌ను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దసరా వేళ విషాదం.. పూజ చేస్తూ కుప్పకూలిన పూజారి..
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
For More AP News And Telugu News