High Court: నటి జెత్వాని కేసులో నిందితులకు బెయిల్
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:32 AM
విజయవాడ: ముంబై నటి జెత్వాని కేసులో నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే వారికి బెయిల్ ఇవ్వవద్దని అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.

విజయవాడ: ముంబై నటి జెత్వాని కేసు (Mumbai actress Jethwani case)లో నిందితులకు హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ (Bail) మంజూరు చేసింది. ఈ సందర్భంగా అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ (Advocate Narra Srinivas) మీడియాతో మాట్లాడుతూ.. నటి జెత్వానిని వేధింపుల కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఐదుగురు నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందన్నారు. విచారణలో జెత్వానిని వారు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, ఈ వ్యవహారంలో నలుగురు పోలీసు అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. కేసు నమోదు కంటే ముందే ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్లారని, ఇలాంటి కేసులో బెయిల్ ఎలా వచ్చిందో అర్థం కావటం లేదన్నారు. ఖచ్చితంగా ఈ బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. జెత్వానిపై పెట్టిన కేసును కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఈ కేసులో ఏ2గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా బెయిల్ కోసం దరఖాస్తు చేయలేదని అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ తెలిపారు.
కాగా సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేయాలని హైకోర్టును సీఐడీ కోరింది. ‘కేసులో ఏ2గా ఉన్న అప్పటి నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు సూచనల మేరకు వీరంతా ప్రణాళిక ప్రకారం జెత్వానీని కట్రపూరితంగా కేసులో ఇరికించినట్లు దర్యాప్తులో తేలింది. జెత్వానీని అరెస్ట్ చేయాలని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్‌గున్నీలకుపీఎస్ఆర్ ఆంజనేయులు సూచించారు. కేసు నమోదు చేయడానికి ఒకరోజు ముందే ముంబైకి వెళ్లేందుకు వీలుగా కాంతిరాణా దిగువస్థాయి పోలీసులకు విమాన టికెట్లు బుక్ చేశారు. పర్యవసానాలు ఆలోచించకుండా పైఅధికారి చెప్పినట్లు ఐపీఎస్ అధికారులు నడుచుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అమాయక మహిళను కేసులో ఇరికించడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కుక్కల విద్యాసాగర్‌తో కలిసి కుట్రలో పాల్గొనడం ద్వారా పోలీస్ మ్యాన్యువల్ ఆర్డర్‌ను ఉల్లంఘించారు. పోలీసు ఉన్నతాధికారులే నేరంలో భాగం కావడం ద్వారా పోలీస్ శాఖకు అపకీర్తి తెచ్చారు. ఇలాంటి వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశం ఉం ది. కీలక సాక్షులపై ఒత్తిడి చేసి వాస్తవాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది. దర్యాప్తు నిరాటంకంగా సాగాల్సి ఉంది.
వాస్తవాలను వెలికితీసి దర్యాప్తు పూర్తి చేసేందుకు పిటిషనర్ల కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం. ఇలాంటి అధికారులకు బెయిల్ మంజూరు చేస్తే ప్రజలు ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం కోల్పోతారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో వీరి విషయంలో దయ చూపవద్దు. దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ దశలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుంది. ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేయండి’ అని సీఐడీ కోరింది. జెత్వానీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కాంతిరాణా తాతా, విశాల్‌గున్ని తదితరులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. దీంతో సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్‌పీ సరిత వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్ రియాక్షన్..
వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News