Andhra Pradesh: పేదలకు స్థలాల సంబరం !
ABN , Publish Date - Jan 18 , 2025 | 02:58 AM
Andhra Pradesh: నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పల్లెల్లో 3 సెంట్లు.. పట్టణాల్లో 2 సెంట్లు
రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఫ్రీహోల్డ్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి?
మంత్రులతో పరిశీలనకు నిర్ణయం
లావాదేవీలు మరికొంతకాలం స్తంభన
నిషేధ జాబితా నుంచి వివాదం లేనివి తొలగింపు
2019 కటాఫ్‌గా ఆక్రమిత ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ
ధాన్యం సేకరణకు 700కోట్ల రుణానికి అనుమతి
మూడు కేటగిరీలుగా గ్రామ, వార్డు సచివాలయాలు
తోటపల్లి బ్యారేజీపై రెండు మినీ హైడల్ ప్రాజెక్టులు
వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని తీర్మానించింది. ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ పర్యవేక్షణకోసం రాష్ట్ర స్థాయిలో రెవెన్యూమంత్రి అధ్యక్షతన, జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటుచేయాలని నిశ్చయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం ఇంకా అనేక ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. ఆ వివరాలను సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు... వైసీపీ ప్రభుత్వ హయాంలో అస్సైన్‌మెంట్ నుంచి విముక్తి కలిగించిన భూములు (ఫ్రీహోల్డ్) భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయో పరిశీలన చేయించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాల వారికి వ్యవసాయ భూములను అస్సైన్‌మెంట్ కింద ఇచ్చి ఇరవై సంవత్సరాలు దాటితే ఆ వర్గాల వారు వాటిని ఎవరికైనా పూర్తి హక్కులతో అమ్ముకోవడానికి నాటి వైసీపీ ప్రభుత్వం ఒక జీవో ద్వారా అవకాశం ఇచ్చింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పదమూడున్నర లక్షల ఎకరాల భూమిని ఫ్రీహోల్డ్ చేశారు. అందులో పాతిక వేల ఎకరాల భూమి ఆ వర్గాల వారి నుంచి ఇతరుల చేతికి అధికారికంగా మారిపోయి రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి.
ఈలోపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసింది. ఆ గడువు ఈ నెల పదో తేదీతో ముగియడంతో మళ్లీ మరోసారి నిలిపివేతను పొడిగిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకొంది. ఈ సమయంలోనే ఈ భూములు వైసీపీ హయాంలో ఎవరి చేతుల్లోకి పోయాయన్నదానిపై చర్చ జరిగింది. వైసీపీ పెద్దలు ఈ భూములను భారీగా కొల్లగొట్టారని, పేదలకు నామమాత్రపు ధర చెల్లించి వీటిని హస్తగతం చేసుకొన్నారని, జీవో రాబోతోందని ముందుగానే ఆ పార్టీ నేతలు తెలుసుకొని దానికిముందే ఆ భూములను అనధికారికంగా కొనుక్కొన్నారని కొందరు మంత్రులు చెప్పారు. ‘‘ఒక్క సత్యసాయి జిల్లాలోనే రెండున్నర లక్షల ఎకరాల భూమి ఫ్రీహోల్డ్ అయింది. లేపాక్షి నాలెడ్డ్ హబ్‌కు ఇచ్చిన భూముల మధ్యలో అస్సైన్‌మెంట్ భూములు వేల ఎకరాలు ఉన్నాయి. వాటిని వైసీపీ నేతలు కొట్టేశారని అనుమానం ఉంది. అక్కడ పరిశ్రమలు వస్తే వారు చేజిక్కించుకొన్న భూములకు విపరీతమైన ధరలు వస్తాయి. దీనిపై పరిశీలన జరపాలి’’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. విశాఖ చుట్టుపక్కల కూడా ఇదే తంతు జరిగిందని మరో మంత్రి చెప్పారు. దీంతో ఫ్రీహోల్డ్ అయిన భూముల జాబితాను ఇన్‌చార్జి మంత్రులకు అందచేస్తామని, అవి ఎవరి చేతుల్లో ఉన్నాయో మంత్రులు పార్టీ వర్గాల ద్వారా సమాచారం సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వానికి అవసరం అయినప్పుడు ఈ భూములను రిజిస్ట్రేషన్ విలువకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకొనే హక్కు ఉంటుందన్న నిబంధన పెట్టి రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తే బాగుంటుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సూచించారు. పేదలు ఎవరైనా తమ భూములను వైసీపీ నేతలు కారుచౌకగా కొట్టేశారని ఫిర్యాదు చేస్తే ఆ భూములు ఆ పేదలకే తిరిగి చెందేలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పయ్యావుల సూచించారు. మంత్రుల పరిశీలన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
ఏడు వేల ఎకరాల భూమిని నిబంధనలకు వ్యతిరేకంగా ఫ్రీహోల్డ్ చేశారని ఫిర్యాదులు రావడంతో దానిపై ఏం చర్య తీసుకోవాలో మంత్రుల కమిటీ సూచించాలని ముఖ్యమంత్రి చెప్పారు. 22 ఏ నిబంధన కింద నిషేధ జాబితాలోకి వెళ్లిన భూములను సబబైన కారణం ఉన్నప్పుడు తొలగించే అంశం పరిశీలించే బాధ్యతను కూడా మంత్రుల కమిటీకి అప్పగించాలని నిర్ణయుంచారు. ఒక సర్వే నంబర్‌లో కొంత ప్రభుత్వ భూమి ఉంటే, మొత్తం సర్వే నంబర్‌లోని భూమి అంతటనీ నిషేధ జాబితాలో పెట్టడంతో సమస్యలు వస్తున్నాయని అనేక మంది ఫిర్యాదు చేస్తుండటంతో ఆ విషయం పరిశీలించాలని కమిటీకి సీఎం సూచించారు. అలాగే వైసీపీ హయాంలో రాజకీయ కక్షతో కావాలని నిషేధ జాబితాలో పెట్టిన భూముల విషయం కూడా పరిశీలించాలని కోరారు.
2019 వరకే ఆక్రమణల క్రమబద్ధీకరణ
ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇళ్లు కట్టుకొన్న వారి ఇంటి స్థలాలు క్రమబద్ధీకరించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఇటువంటి స్థలాల క్రమబద్ధీకరణకు 2019లో టీడీపీ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిందని, దానినే కటాఫ్ తేదీగా నిర్ణయించి అప్పటివరకూ జరిగిన ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని సమావేశం నిర్ణయించింది. వైసీపీ హయాంలో జరిగిన ఆక్రమణలపై అనేక ఆరోపణలు ఉన్నందువల్ల వాటిని పక్కన పెట్టాలని నిశ్చయించారు. 150 గజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరించాలని, ఐదు వందల గజాల పైన ఆక్రమించుకొన్న వారి నుంచి రిజిస్ట్రేషన్ విలువకు ఐదు రెట్లు అదనంగా వసూలుచేసి క్రమబద్ధీకరించాలని నిశ్చయించారు. ఈ మధ్యలో ఉన్నవారికి వివిధ శ్లాబుల్లో ఫీజులు నిర్ణయిస్తారు. ఇళ్ల స్థలాలకు నగరాలు, పట్టణాల్లో స్థలాలు దొరకడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అటువంటిచోట టిడ్కో ఇళ్లను నిర్మి ంచి పేదలకు ఇద్దామని ముఖ్యమంత్రి తెలిపారు.
మరికొన్ని నిర్ణయాలు..
నివాసయోగ్యం కానిచోట, చెరువుల్లో , శ్మశానాల పక్కన ఇచ్చారంటూ చాలా మంది గతంలో లే అవుట్లలో ఇళ్లు కట్టుకోలేదు. వారు కోరుకుంటే అప్పటి కేటాయింపులు రద్దుచేసి వేరేచోట స్థలాలు మంజూరుచేయాలి. ఊరికి దూరంగా 30, 40 కిలోమీటర్ల దూరంలో గతంలో స్థలాలు పొందినవారు.. కోరుకుంటే వారికి మళ్లీ స్థలాలు కేటాయించాలి. ఇళ్లు కట్టకుండా ఖాళీగా లే అవుట్లను వదిలేసిన చోట మురుగు చేరి, దోమల సమస్య ఎక్కువగా ఉంది. అటువంటి చోట కేటాయింపులు రద్దుచేసి.. కోరుకుంటే అర్హతను బట్టి మళ్లీ కేటాయించాలి.
గ్రామ,వార్డు స్థాయిలో రియల్ టైమ్ గవర్నెన్స్‌ని మరింత సమర్థవంతంగా అమలుచేయాలి. జనాభా ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించాలి.
2024-25 ఖరీఫ్ ధాన్య సేకరణకు అవసరమైన నిధులను నేషనల్ కో-ఆపరేటివ్ డవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) నుంచి ఏపీ మార్క్‌ఫెడ్ రూ. 700 కోట్ల మేర రుణాన్ని పొందేందుకు (ఇప్పటికే పొందిన రూ.6000 కో ట్ల రుణానికి అదనంగా) ప్రభుత్వ హామీని పొడిగించాలి.
ఫెర్రో అల్లాయ్స్ అసోసియేషన్ అభ్యర్థనపై 31-03-2025 వరకు టారిఫ్, విద్యుత్ సుంకం పెంచరాదని నిర్ణయం.
మరో 63 అన్నా క్యాంటీన్‌లు 38.43 కోట్లతో ఏర్పాటు
నాగావళి నదిపై సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీపై రెండు మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం.
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదికి కుడి వైపు వరద రక్షణ గోడ నిర్మాణానికి 294.20 కోట్లతో పరిపాలనా అనుమతులు..