YCP Activist Arrest: వైసీపీకి షాక్.. బత్తల శ్రీనివాసులరెడ్డి అరెస్ట్..
ABN , Publish Date - Dec 16 , 2025 | 06:47 PM
కూటమి ప్రభుత్వంలోని పలువురు కీలక నేతలతోపాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త బత్తల శ్రీనివాసుల రెడ్డిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు.
కడప, డిసెంబర్ 16: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన బద్వేల్‌కు చెందిన వైసీపీ కార్యకర్త బత్తల శ్రీనివాసుల రెడ్డిని అరెస్ట్ చేసినట్లు కడప ఇంచార్జ్ డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ పోస్టులు ఫార్వడ్ చేసిన మరో 10 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. మంగళవారం కడపలో ఇంచార్జ్ డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. బత్తల శ్రీనివాసుల రెడ్డిపై చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌తోపాటు వివిధ పోలీస్ స్టేషన్‌లలో పలు కేసులు నమోదైనట్లు చెప్పారు.
గతంలో శ్రీనివాస రెడ్డి విదేశాలకు పారిపోయారని గుర్తు చేశారు. సోమవారం విదేశాల నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా అతడిని ఎయిర్ పోర్టు పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులపై అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేనా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై బత్తల శ్రీనివాసులరెడ్డి సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దీనిపై కడపకు చెందిన పలువురు టీడీపీ నేతలు గతేడాది నవంబర్ (2024)లో కడపలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అలాగే బత్తల శ్రీనివాసులరెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో సైతం కేసులు నమోదయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి తర్వాత.. బత్తల శ్రీనివాసులరెడ్డి గల్ఫ్ వెళ్లిపోయాడు. దాంతో అతడి కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం గల్ఫ్ నుంచి అతడు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నాడు. అతడి ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకుని.. కడప పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కడప పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడపకు తీసుకువచ్చారు.
ఇలా దిగి.. అలా పారిపోయిన అర్జున్ రెడ్డి !
మరోవైపు దుబాయ్ నుంచి వచ్చిన వైసీపీ సోషల్ మీడియా కంటెంట్ రైటర్ అర్జున్ రెడ్డి సోమవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఎయిర్ పోర్ట్‌లో అతడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. అతడి అరెస్ట్‌పై గుడివాడ పోలీసులు ఎల్‌ఓసీ ఇవ్వడంతో వెంటనే కృష్ణా జిల్లా ఎస్పీకి ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు.
దాంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు గుడివాడ పోలీసులు పయనమయ్యారు. సోషల్ మీడియా కేసులో తనను అరెస్ట్ చేస్తారని అర్జున్ రెడ్డి భయాందోళన చెందాడు. దాంతో అతడు తిరిగి దుబాయ్‌కి పారిపోయాడని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!
తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్
For More AP News And Telugu News