SECI : ‘సెకీ’తో సంకటం
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:12 AM
సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఆయన చేసుకున్న ఒప్పందం కారణంగా ప్రజలపై రూ.లక్ష కోట్లకు పైగానే భారం పడుతుందని...
కరెంటు కొంటే నష్టం.. కొనకుంటే కష్టం!
జగన్ పెట్టిన ఒప్పందపు పితలాటకం
సౌర విద్యుత్ సరఫరాకు సెకీ సంసిద్ధత
రాష్ట్ర ప్రభుత్వానికి వరుస లేఖలు
2,500 మెగావాట్ల పంపిణీకి రెడీ
కరెంటు కొనడానికి సిద్ధమా అని ప్రశ్న
అమలు చేస్తే పాతికేళ్లు జనంపై భారం
రూ.లక్ష కోట్లకుపైగా చెల్లించాలి
రద్దు చేసుకుంటే 2,900 కోట్ల ఫైన్
అదనంగా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ
తేల్చుకోలేక ఇంధన శాఖ సతమతం
సీఎంతో చర్చించాక బదులిచ్చే యోచన
వీలింగ్ చార్జీలను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం!
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముందూ వెనుక ఆలోచించకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో చేసుకున్న 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందం ఇప్పుడు రాష్ట్రప్రభుత్వానికి గుదిబండగా మారనుంది. దీని అమలుపై ఇంధన శాఖ తర్జనభర్జన పడుతోంది. అమలు చేస్తే పాతికేళ్లపాటు రాష్ట్ర ప్రజలపై మోయలేనంత భారం పడుతుంది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే.. యూనిట్ కూడా కొనకుండానే రూ.2,900 కోట్లకు పైగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఎటూ తేల్చుకోలేక అడకత్తెరలో పోకచెక్కలా ఆ శాఖ నలిగిపోతోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రజలపై 25 ఏళ్లు భారం మోపేలా నాటి సీఎం జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు రాష్ట్రానికి పెను శాపంగా మారుతోంది. సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఆయన చేసుకున్న ఒప్పందం కారణంగా ప్రజలపై రూ.లక్ష కోట్లకు పైగానే భారం పడుతుందని ఇంధన రంగ నిపుణులు హెచ్చరించినా ఆయన వినిపించుకోలేదు. వాస్తవానికి ఈ ఒప్పందం చేసుకోకముందు.. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లతో ప్రజలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుందని ఆయన వాదించారు. అధికారంలోకి రాగానే అంతకుముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను ఒక్క ఉత్తర్వుతో రద్దు చేశారు. ఏడాది తిరక్కుండానే ఆయనే.. సెకీతో ఏకంగా పాతికేళ్లకు 7,000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
2024 సెప్టెంబరులో 3,000 మెగావాట్లు, 2025 సెప్టెంబరులో మరో 3,000 మెగావాట్లు, 2026 సెప్టెంబరులో మిగిలిన 1,000 మెగావాట్లు సరఫరా చేసేందుకు డిస్కంలు, రాష్ట్ర ఇంధన శాఖ, కేంద్రం, సెకీ కలిసి 2021 సెప్టెంబరు 1న ఈ ఒప్పందం చేసుకున్నాయి. అప్పటికే గుజరాత్‌లో సోలార్ విద్యుత్‌ను యూనిట్‌కు రూ.1.99కు విక్రయిస్తుంటే.. జగన్ సర్కారు మాత్రం 50 పైసలు అధికంగా యూనిట్ రూ.2.49కు కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అధిక ధర పెట్టడంపై లాజిక్‌లు అడగొద్దని, తక్కువ ధరకే కొంటున్నామని జగన్ అడ్డగోలుగా వాదించారు. అన్నీ కలిపితే యూనిట్‌కు రూ.5.45 వరకు వెళ్తోంది. అంతేగాక రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుచేయకుండా.. ఎక్కడో రాజస్థాన్ నుంచి కరెంటు సరఫరా చేయాలంటే అదనంగా వీలింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏమీ ఇవ్వక్కర్లేదని కూడా జగన్ బుకాయించారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ.. నాటి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక మంత్రి), సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఇంకా తీర్పు రాలేదు. రాజస్థాన్ నుంచి రాష్ట్రానికి 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ రావాలంటే.. భారత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీజీసీఈఎల్) ట్రాన్స్‌మిషన్ లైన్లు అందుబాటులోకి తేవాలి. ఇందుకు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ చార్జీలు వర్తిస్తాయి. ఆ లైన్ల నిర్మాణం పనులు వచ్చే నెలాఖరుకల్లా పూర్తవుతాయని పీజీసీఈఎల్ చెబుతోంది. అయితే ఈ ఏడాది మే నెల నుంచి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) ఆదేశాల మేరకు.. కరెంటు కొన్నా.. కొనకున్నా గ్రిడ్ ఆధారిత చార్జీలు (జీపీఏ) చెల్లించాల్సిందే. జీపీఏ అమల్లోకి వస్తే 25 ఏళ్లకు రూ.65,000 కోట్ల దాకా చెల్లించాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఇంధన రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంలోనూ జీపీఏ చార్జీలపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఆ ఒప్పందం లేకున్నా..
సెకీతో ఒప్పందం ఇప్పుడు అమల్లో లేకున్నా.. వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వడం సహా అన్ని వర్గాలకు రోజుకు 12,500 మెగావాట్ల దాకా ఇంధన శాఖ సరఫరా చేస్తోంది. ఒకట్రెండు మిలియన్ యూనిట్ల లోటు మినహా.. రాష్ట్రంలో విద్యుత్ సరిపోతోంది. ఇప్పుడు సెకీ నుంచి కొంటే కరెంటు మిగిలిపోతుంది. పైగా సోలార్ కరెంటు పగటిపూట మాత్రమే ఉత్పత్తి అవుతుంది. రాత్రి వేళల్లో పీక్ డిమాండ్‌ను తట్టుకోవాలంటే.. మళ్లీ బహిరంగ మార్కెట్లో కొనుక్కోవడం తప్పదు. అంటే.. సెకీ నుంచి అంత కొంటున్నా.. రాత్రి వేళల్లోని డిమాండ్‌కు ఏ మాత్రం ఉపయోగం లేదు.
మరో హిందూజా కానుందా?
సెకీతో ఒప్పందం మరో హిందూజా ఒప్పందం అవుతుందనే సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. హిందూజాతో ఒప్పందం కారణంగా.. కరెంటు వాడకుండానే డీమ్డ్ చార్జీల రూపంలో రూ.2,200 కోట్ల దాకా చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు సెకీ నుంచి కరెంటు కొనక.. ఆ కార్పొరేషన్ కూడా కోర్టుకెక్కితే.. చార్జీల భారం తప్పదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కింద ఏటా రూ.100 కోట్ల వరకు కట్టాల్సి ఉంటుంది.
సెకీ నుంచి లేఖలు..
2,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ సమీకరించాం.. సరఫరాకు సిద్ధంగా ఉన్నామంటూ సెకీ గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(ఏపీసీసీ)కి వరుసగా లేఖలు రాస్తోంది. ఒప్పందంతో జరిగే నష్టాలను తలచుకుని.. ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఇంధన శాఖ సతమతమవుతోంది. అమలు చేస్తే.. రూ.లక్ష కోట్లకుపైగా భారం.. రద్దు చేసుకుంటే.. అపరాధ రుసుం కింద రూ.2,900 కోట్లు సెకీకి చెల్లించాలి. దీంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ ఒప్పందం అమలు చేయాలంటే.. ట్రాన్స్‌మిషన్ (వీలింగ్) చార్జీలను పూర్తిగా మినహాయించాలని కేంద్ర విద్యుత్ శాఖను కోరాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంతో చర్చించిన తర్వాత సెకీ లేఖలకు సమాధానం చెప్పాలని భావిస్తోంది.