Share News

Tirumala: టీటీడీలో రిటైర్మెంట్‌ కలవరం

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:53 AM

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస దీక్షితుల రిటైర్మెంట్‌కు సంబంధించి టీటీడీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సింగిల్‌ జడ్జి సస్పెండ్‌ చేశారు.

Tirumala: టీటీడీలో రిటైర్మెంట్‌ కలవరం

  • గోవిందరాజస్వామి ఆలయం ప్రధాన అర్చకుడి రిటైర్మెంట్‌ ప్రొసీడింగ్స్‌ సస్పెండ్‌ చేసిన హైకోర్టు

  • ఇతర అర్చకులూ కోర్టును ఆశ్రయించే అవకాశం

తిరుపతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస దీక్షితుల రిటైర్మెంట్‌కు సంబంధించి టీటీడీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సింగిల్‌ జడ్జి సస్పెండ్‌ చేశారు. దీంతో 65 ఏళ్ల వయసు దాటినప్పటికీ ఆయన మునుపటిలాగే ప్రధాన అర్చకుడిగా కొనసాగనున్నారు. ఈ నిర్ణయంతో గతంలో టీటీడీ ఆలయాల్లో రిటైరైన ప్రధాన అర్చకులు, సాధారణ అర్చకులు సైతం తమకూ ఆ ఉత్తర్వులను వర్తింపజేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఏర్పడింది. వివరాలు.. టీటీడీ నిర్వహణలో ఉన్న తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పాత మిరాశీ కుటుంబానికి చెందిన ఏపీ శ్రీనివాస దీక్షితులు ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. టీటీడీ సర్వీసు నిబంధనల ప్రకారం 65 ఏళ్లు దాటిన ప్రధాన అర్చకులు, సాధారణ అర్చకులు సహా ధార్మిక విధులు నిర్వర్తించే ఉద్యోగులందరూ రిటైర్‌ కావాలి. ఈ క్రమంలో శ్రీనివాస దీక్షితులు ఈ ఏడాది మే 31న రిటైర్‌ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అదే నెల 29న ఆయన రిటైర్మెంట్‌కు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను టీటీడీ జారీ చేసింది.


గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సర్వీసు నుంచి రిటైరైన ప్రధాన అర్చకులు, సాధారణ అర్చకులు శారీరక పటుత్వం ఉన్నంత కాలం సంభావన అర్చకులుగా టీటీడీ ఆలయాల్లో పనిచేసే అవకాశముంది. ఆ నిబంధనను అనుసరించి శ్రీనివాస దీక్షితులను జూన్‌ 1 నుంచి సంభావన అర్చకుడుగా కొనసాగేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే టీటీడీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ శ్రీనివాస దీక్షితులు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఎస్‌.సుబ్బారెడ్డి టీటీడీ జారీ చేసిన రిటైర్మెంట్‌ ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేస్తూ గత నెల 25న ఉత్తర్వులిచ్చారు. శ్రీనివాస దీక్షితుల రిట్‌ పిటిషన్‌ను గతంలో టీటీడీ దాఖలు చేసి ధర్మాసనం ఎదుట పెండింగ్‌లో ఉన్న రిట్‌ అప్పీలుతో జత చేయాలని ఆదేశించారు.


మిరాశీ వ్యవస్థ రద్దును ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా 65 ఏళ్లు దాటినప్పటికీ ప్రధాన అర్చకులు, అర్చకులు విధులు నిర్వర్తించగలిగే స్థితిలో ఉంటే సంభావన అర్చకులుగా కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఈ విషయంలో హైకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. దీనిపై అస్పష్టతతో సాంకేతికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీటీడీకి తాజాగా సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు మరింత ఇబ్బందికరంగా మారాయి.

Updated Date - Jul 06 , 2025 | 04:54 AM