B C Janardhan Reddy: వైసీపీ కోటి సంతకాల సేకరణ నాటకం.. బూటకం
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:31 PM
పీపీపీ విధానంలో వైద్య కళాశాలు నిర్మించడం వల్ల కలిగే ఫలితాలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సోదాహరణగా వివరించారు.
అమరావతి, డిసెంబర్16: రాష్ట్రంలోని వైద్య కళాశాలల వ్యవహారంలో పీపీపీ విధానంలో వెళ్లాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఆ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. అలాంటి వేళ పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై పార్లమెంట్ స్థాయి సంఘం పలు సిఫార్సులు చేసింది.
దీనిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మంగళవారం విజయవాడలో స్పందించారు. ఈ సిఫార్సులు వైసీపీకి చెంపపెట్టు అని ఆయన స్పష్టం చేశారు. వైద్య విద్య ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో.. ఎక్కువ మందికి వైద్య విద్య అందించాలంటే ఈ విధానం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కేంద్రం స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ నాటకమంతా ఒక బూటకమని అభివర్ణించారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి.. ప్రవేటీకరణకు ఉన్న వ్యత్యాసాన్ని సైతం గుర్తించకుండా దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ పీపీపీ విధానం వల్ల కలిగి ప్రయోజనాలను ఆయన సోదాహరణగా వివరించారు. ఒక్కో మెడికల్ కాలేజీలో 250 యూజీ సీట్లు పెంచుకునే వెసులుబాటు ఉందని తన నివేదికలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు.
మెడికల్ కాలేజీల నిర్మాణంపై హైకోర్టు సమర్థించినా ప్రతిపక్ష నేతల్లో మార్పు కనిపించక పోవడం దురదృష్టకరమని చెప్పారు. మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఎక్కడైనా చర్చకు తమ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైసీపీ నేతలకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టడం ద్వారా వైద్య విద్య మెరుగుపడటంతోపాటు నిరుపేదలకు మెరుగైన వైద్యం సాయం అందించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అదనంగా 220 సీట్లు రాష్ట్రంలో పెరగడంతో పాటు, 110 సీట్లు ప్రభుత్వ (కన్వీనర్) కోటాలో పెరగనున్నాయన్నారు. వైసీపీ పాలనలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రూ. 8,400 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. కేవలం రూ.1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి చేతులు దులుపుకున్నారని వివరించారు. 151 సీట్లతో ప్రజలు అధికారం కట్టబెడితే, 17 మెడికల్ కాలేజీలు నిర్మించలేని.. మీరు నేడు ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అంటూ వైసీపీ నేతల వైఖరిని ఆయన ఎండగట్టారు.
రానున్న రెండేళ్లలో కాలేజీ నిర్మాణాలు పూర్తి చేసి, రాష్ట్ర విద్యార్ధులకు అదనంగా 1750 సీట్లు పొందేందుకు వెసులుబాటు కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వమే వైద్య కళాశాలలు, ఆసుపత్రుల యాజమాన్యాన్ని కొనసాగిస్తుందని.. ప్రవేట్ భాగస్వామి కేవలం మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణలో సహాయం అందిస్తుందని ఆయన వివరించారు. సామాన్య ప్రజల విషయం పక్కన పెడితే, మీరు చేస్తున్న నిరసనలకు కనీసం వైసీపీ కార్యకర్తల నుంచి కూడా స్పందన కరువైందని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్
రూ.2.40లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి.. తండ్రికి తెలియడంతో..
For More AP News And Telugu News