Share News

TDP MP Sri Krishna Devarayalu: కృష్ణా జలాల వినియోగం.. నీటి కేటాయింపులపై చర్చ జరగాలి: టీడీపీ ఎంపీ

ABN , Publish Date - Nov 30 , 2025 | 02:57 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, కిరణ్ రిజిజు అధ్యక్షతన ఆదివారం ఉదయం న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు.

TDP MP Sri Krishna Devarayalu: కృష్ణా జలాల వినియోగం.. నీటి కేటాయింపులపై చర్చ జరగాలి: టీడీపీ ఎంపీ

న్యూఢిల్లీ, నవంబర్ 30: కృష్ణా నదీ జలాల వినియోగం.. నీటి కేటాయింపుల్లో స్పష్టతపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కేంద్రాన్ని కోరినట్లు లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఆదివారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్‌, కిరణ్ రిజిజు అధ్యక్షత అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి లేవనెత్తిన అంశాలను విలేకర్లకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయాలు వివరించారు. పార్లమెంట్‌లో ఏడు అంశాలపై చర్చించాలని కోరామన్నారు. ఓటర్ల జాబితా క్రమబద్దీకరణ సర్ (SIR)ను స్వాగతిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సత్వరమే సర్ (SIR) ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు.


ఆధార్ తరహాలో.. ఓటర్ కార్డును సైతం పకడ్బందీగా రూపొందించాలని కోరామన్నారు. జి.ఎస్.టిలో మార్పుల వల్ల కలిగిన ఆర్దిక ప్రయోజనాలు, అలాగే పర్యవసానాలపై చర్చ జరగాలని విజ్ఞప్తి చేశారు. పత్తి, మొక్కజొన్న, అరటి, ఆక్వా రైతుల సమస్యలపై సభలో సమగ్రంగా చర్చించాలని కోరినట్లు చెప్పారు. అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)తో కొన్ని సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అరటి, మొక్కజొన్న పంటలకు లభించే కనీస మద్దతు ధర (ఎమ్.ఎస్.పి)తోపాటు అమెరికా పన్ను విధానం కారణంగా ఏపీలోని ఆక్వా రైతుల ఇబ్బందులపై కూడా చర్చించాల్సి ఉందన్నారు.


ఆక్వా రైతుల సమస్యలపై చర్చ జరిపి.. పార్లమెంట్ వేదికగా వారికి స్పష్టమైన హామీతోపాటు భరోసా ఇవ్వాలని కోరినట్లు వివరించారు. ఇక బహిరంగ సభలు, తొక్కిసలాటలో మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి.. ఒక జాతీయ విధానం రూపొందించాలన్నారు. దీనిపై చర్చ సైతం జరగాలని కోరామని చెప్పారు. ఇటీవల సంభవించిన తుఫాన్ వల్ల ఏపీలో జరిగిన నష్టంపై చర్చకు అనుమతించాలని కూడా కోరినట్లు ఆయన తెలిపారు.


విశాఖపట్నం వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్ సమావేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు సరఫరా పధకంపై సైతం చర్చ జరగాలని ఈ సమావేశంలో కోరినట్లు తెలిపారు.


పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, కిరణ్ రిజిజు అధ్యక్షతన ఆదివారం ఉదయం న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాని విపక్ష పార్టీ సభ్యులకు కేంద్రమంత్రులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులు సైతం ఆమోదం పొందనున్నాయి. వీటిపై కూడా ఆదివారం జరిగిన భేటీలో కీలకంగా చర్చించారు.

ఈ వార్తలు కూాడ చదవండి..

లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం

భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?

Read Latest AP News and National News

Updated Date - Nov 30 , 2025 | 03:03 PM