Share News

Pinnelli Brothers: సుప్రీంకోర్టు ఆదేశాలు.. పిన్నెల్లి సోదరులు కీలక నిర్ణయం

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:54 PM

జంట హత్యల కేసులో తప్పించుకు తిరుగుతున్న వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోవాలని వారు నిర్ణయించుకున్నారు.

Pinnelli Brothers: సుప్రీంకోర్టు ఆదేశాలు.. పిన్నెల్లి సోదరులు కీలక నిర్ణయం
Pinnelli Brothers

నరసరావుపేట, డిసెంబర్ 10: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఎట్టకేలకు కోర్టులో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం మాచర్ల కోర్టులో ఈ పిన్నెల్లి సోదరులు లొంగిపోనున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఏ7గా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఉన్నారు. రెండు వారాల్లోగా లొంగిపోవాలంటూ వీరిని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ గడువు రేపటితో అంటే గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మాచర్ల కోర్టులో లొంగిపోవాలని పిన్నెల్లి బ్రదర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారి అనుచరులు చెబుతున్నారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..?

2025, మే 24వ తేదీన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల జంట హత్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. ఈ కేసులో ఏ1 గా జవిశెట్టి శ్రీను, ఏ2గా తోట వెంకట్రావు, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని చేర్చారు.

తమకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ పిన్నెల్లి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. అందుకు హైకోర్టు నిరాకరించింది. సెప్టెంబరు 1వ తేదీన హైకోర్టు తీర్పును పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అన్నదమ్ములిద్దరికీ సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. ముందస్తు బెయిల్‌పై మాత్రం విచారణ కొనసాగుతోంది. తుది నిర్ణయం వెలువరించేంత వరకు వారిని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలను జారీ చేసింది.


అయితే సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా.. తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ నిందితులు పోలీసు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదన్నారు. సాక్షులను సైతం వారు బెదిరిస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. అంతేకాదు.. సాక్ష్యాలను ట్యాంపర్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. ప్రభుత్వం తరఫు న్యాయవాది లూథ్రాకు పలు ప్రశ్నలు సంధించారు.


అనంతరం ఈ కేసులో పలు వాదోపవాదాలు జరిగిన తర్వాత.. పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. వీరిద్దరిని ఆరెస్టు చేయడానికి పోలీసులు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రెండు వారాల సమయమివ్వాలని సిద్ధార్థ్‌ దవే కోరగా.. ఆ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దాంతో పిన్నెల్లి సోదరులు లొంగిపోవడానికి రెండు వారాల గడువును సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కోర్టులో లొంగిపోవాలని పిన్నెల్లి సోదరులు నిర్ణయం తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు

తొలి దశ పల్లె పోరుకు సర్వం సిద్ధం.. ఓటరుకు కీలక సూచన: ఎస్ఈసీ

Read Latest AP News and National News

Updated Date - Dec 10 , 2025 | 07:00 PM