First Phase Panchayat Elections In Telangana: తొలి దశ పల్లె పోరుకు సర్వం సిద్ధం.. ఓటరుకు కీలక సూచన: ఎస్ఈసీ
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:29 PM
తెలంగాణలో తొలి దశ పల్లె పోరుకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. గురువారం ఉదయం 7.00 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనున్నాయని.. ఈ నేపథ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్‌లో ఎస్ఈసీ రాణి కుముదిని విలేకర్లతో మాట్లాడుతూ.. తొలి దశ పల్లె పోరుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. గురువారం ఉదయం 7.00 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఈ తొలి దశలో 56,19,430 మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో ఈ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల విధుల్లో లక్ష మందికి పైగా సిబ్బంది పాల్గొనున్నారని వివరించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు 18 రకాల ఐడి కార్డులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏ రకమైన ఐడి కార్డును పోలింగ్ బూత్ అధికారులకు చూపించిన ఓటు వేయవచ్చునన్నారు. ఇక మంగవారం నుంచి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్ షాపులన్నీ మూసి వేసినట్లు చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మేజిస్ట్రియల్ పవర్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్ఈసీ వివరించారు.
రూ. 8 కోట్లు సీజ్: లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇప్పటి వరకు రూ. 8 కోట్ల నగదు సీజ్ చేశామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ వెల్లడించారు. రూ. రెండున్నర కోట్ల విలువైన డ్రగ్స్, రూ. 2 కోట్ల క్యాష్, రూ. 3 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశామన్నారు. 3,214 మందిపై ఎఫ్‌ఐఆర్, 31,428 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. కొంత మంది వద్ద నుంచి ముందస్తు చర్యల్లో భాగంగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
తొలి విడతలో..
తొలి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెర పడింది. ఈ తొలి విడత ఎన్నికల్లో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. వాటిలో 5 చోట్ల అసలు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటి మినహా మిగిలిన 3836 సర్పంచ్ స్థానాలకు రేపు అంటే గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొలి విడత పోరులో మొత్తం 13,127 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రూ. 175 కోట్ల నిధులను రేవంత్ ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో రూ. 100 కోట్ల నిధులను ఇప్పటికే సర్కార్ విడుదల చేసింది.
మూడు దశల్లో పోలింగ్..
తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరుగుతున్నాయి. తొలి దశ రేపు అంటే డిసెంబర్ 11న జరుగుతుండగా.. రెండో దశ డిసెంబర్ 14న, మూడో దశ డిసెంబర్ 17వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు
దీపావళికి ప్రపంచవ్యాప్త గుర్తింపు: ప్రధాని మోదీ
Read Latest Telangana News and National News