Diwali: దీపావళికి ప్రపంచవ్యాప్త గుర్తింపు: ప్రధాని మోదీ
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:58 PM
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ దీపావళి. ఈ పండగకు అరుదైన గుర్తింపు లభించింది. యొనెస్కో వారసత్వ జాబితాలో ఈ దీపావళి పండగకు స్థానం దక్కింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: దీపావళిని యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ పండగకు ఈ హోదా దక్కడంపై భారత దేశ ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారన్నారు. ఈ పండగ.. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిందని ఆయన పేర్కొ్న్నారు. దీపావళికి ఈ హోదా దక్కడంపై బుధవారం తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. ఈ పండగ.. మన సంస్కృతి, నైతికతలకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుందని చెప్పారు. ఇది మన నాగరికతకు ఆత్మ వంటిదని ఆయన అభివర్ణించారు. ఈ పండగ ధర్మాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. యునెస్కో జాబితాలో చేరడం వల్ల ఈ పండగ మరింత ప్రజాదరణ పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీరాముడి ఆదర్శాలు మనకు శాశ్వతంగా మార్గనిర్దేశనం చేస్తుంటాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వివరించారు.
ప్రతీ భారతీయుడికి గర్వకారణం: ఉపరాష్ట్రపతి
ఇక ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండగను యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చడంపై భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సైతం స్పందించారు. ఈ పండగను యునెస్కో జాబితాలో చేర్చడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ పండగ ప్రపంచ గుర్తింపు పొందిందని తెలిపారు. ఇది ప్రతీ భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. దీపావళి కేవలం ఒక పండుగ మాత్రమే కాదని.. ఇది దేశాన్ని ఏకం చేసే.. ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించే నాగరికతగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అభివర్ణించారు. భారతదేశ బహుళ సాంస్కృతిక, సామాజిక ఐక్యతను సూచిస్తుందని తెలిపారు. అదే సమయంలో ఆశ, సామరస్యం, చీకటిపై కాంతి విజయంగా దీపావళిని ఆయన పేర్కొన్నారు. అధర్మంపై ధర్మం యొక్క శాశ్వత సందేశాన్ని కూడా ఇది తెలియజేస్తుందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ వివరించారు.
ఇది సంతోషకర సమయం: రణధీర్ జైశ్వాల్
వెలుగులు విరజిమ్మే పండగ దీపావళి.. యునెస్కో వారసత్వ జాబితాలో స్థానం సంపాదించుకోవడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. ఇది సంతోషకరమైన సమయమని ఆయన పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండగ ఒక ప్రతీక అని తెలిపారు. అంతేకాదు శ్రీరాముడు ఆయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఈ రోజే. ఈ నేపథ్యంలో ఈ పండగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ గుర్తు చేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో బుధవారం జరిగిన కీలక సమావేశంలో యునెస్కో ప్రతినిధులు.. దీపావళిని వారసత్వ జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు చెందిన 15 అంశాలు ఇప్పటికే వారసత్వ గుర్తింపు ఇచ్చిన విషయం విదితమే. ఈ జాబితాలో కుంభమేళా, కోల్‌కతా దుర్గా పూజ, గుజరాత్‌లోని గర్భా నృత్యం, యోగా, వేద పఠనం, రామలీల చోటు దక్కించుకున్నాయి. ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశాన్ని భారత్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు
అందుకే ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్స్: డీసీపీ రాజేశ్
Read Latest National News and National News