Janardhan Reddy: జగన్ పాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి: మంత్రి జనార్దన్ రెడ్డి
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:28 PM
ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం చంద్రబాబు రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రోడ్ల అభివృద్దికి రూ.2800 కోట్లని కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు బీసీ జనార్దన్ రెడ్డి.
విజయవాడ, నవంబరు9 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీని ఆర్థికంగా విధ్వంసం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు చేసిన పాపాలు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతున్నాయని విమర్శించారు. జగన్ పాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆక్షేపించారు. ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఇవాళ(ఆదివారం) విజయవాడలో జరిగింది.
14 మంది డైరెక్టర్లతో ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ ఎండీ శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజలు వేల కిలోమీటర్లు రోడ్లపై నడవలేని పరిస్థితిని గత జగన్ ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే రూ.1061 కోట్లతో ఐదునెలల్లోనే దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేశామని స్పష్టం చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం చంద్రబాబు రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు రోడ్ల అభివృద్ధికి రూ.2800 కోట్లని కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
మరో రూ.1000 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులు టెండర్లు పిలిచే దశలో ఉన్నాయని వివరించారు. ఏపీలో పలు కీలక రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు చర్యలు తీసుకొంటున్నారని ఉద్ఘాటించారు. పీపీపీ విధానంలో ప్రజలపై టోల్ భారం పడకుండా సీఎం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
రోడ్ల సమస్యని వైసీపీ పట్టించుకోలేదు: ప్రగడ నాగేశ్వరరావు
గత జగన్ ప్రభుత్వంలో రోడ్లు దారుణంగా ఉన్నాయని ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆరోపించారు. రోడ్ల సమస్య పరిష్కారాన్ని గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు సరిచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. రోడ్ల విషయంలో అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీలో రోడ్లను అభివృద్ధి చేయాలని మార్గనిర్దేశం చేశారు. డైరెక్టర్లు వారి ప్రాంతాల్లోని రహదారుల పరిస్థితిని సమీక్షించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. రోడ్ల అభివృద్ధికి డైరెక్టర్లు అందరూ సహకరించాలని ప్రగడ నాగేశ్వరరావు ఆజ్ఞాపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు
Read Latest AP News And Telugu News