Share News

Pawan Kalyan: జగన్ ప్రభుత్వంలో రేషన్ సరుకుల అక్రమాలపై విచారణ చేశాం

ABN , Publish Date - May 31 , 2025 | 05:51 PM

రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని తమ ప్రభుత్వం కాకినాడ, విశాఖపట్నం పోర్టుల్లో పట్టుకుందని గుర్తుచేశారు.

Pawan Kalyan: జగన్ ప్రభుత్వంలో రేషన్ సరుకుల అక్రమాలపై విచారణ చేశాం
Pawan Kalyan

అమరావతి: చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ (Ration Distribution) చేస్తున్నామని... ఇకపై నెలలో 15 రోజులపాటు రెండు పూటల అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది. జగన్ ప్రభుత్వంలో పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలను మూసేసి, ఇంటింటికీ అందిస్తాం అంటూ గొప్పలు చెప్పారు కానీ ఆచరించలేదని మండిపడ్డారు. రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి, ఇంటింటికీ ఇవ్వడం మానేసి నెలలో ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇచ్చారని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.


ఎంతోమంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులుపడ్డారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేదని వెల్లడించారు. మిగిలిన రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిందని వివరించారు. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని తమ ప్రభుత్వం కాకినాడ, విశాఖపట్నం పోర్టుల్లో పట్టుకుందని గుర్తుచేశారు పవన్ కల్యాణ్.


రేషన్ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు, ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు.. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందజేస్తామని తెలిపారు. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా, ప్రతీ ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే దివ్యాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందని వెల్లడించారు. ఈ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జనరంజకంగా అమలవుతుందని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పీఎస్సార్‌కు మరోసారి అస్వస్థత

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 06:29 PM