AP Law And Order: సోషల్ మీడియాలో రెచ్చిపోయే వారి తాట తీయండి.. ఎస్పీలకు చంద్రబాబు హుకుం..
ABN , Publish Date - Sep 13 , 2025 | 08:08 PM
ఏపీ ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పాటిస్తూనే అసాంఘిక శక్తులు భయపడేలా పని చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టొద్దని హుకుం జారీ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ముసుగులో ఎవరు నేరాలకు పాల్పడినా ఊపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మరోసారి స్పష్టం చేశారు. శాంతిభద్రతల( Law And Order)కు విఘాతం కలిగించే వారిని చట్టప్రకారం తగిన విధంగా శిక్షించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇందుకు వైఎస్ వివేకానందరెడ్డి, సింగయ్య మరణాలను కేస్ స్టడీలుగా చూడాలంటూ ఆదేశించారు. ఇవాళ(శనివారం) 26 జిల్లాలకు నూతన ఎస్పీలను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. నేరస్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వారికి వివరించారు. ఈ మేరకు ఎస్పీలకు పలు కీలక సూచనలు చేశారు.
ఏపీ ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ (Friendly Policing) విధానం పాటిస్తూనే అసాంఘిక శక్తులు భయపడేలా పని చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టొద్దని హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకే ప్రథమ ప్రాధాన్యమని.. పెట్టుబడులకు అదే కీలకమన్నారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాల్సి అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇన్వెస్టిగేషన్‌లో టెక్నాలజీతో బెస్ట్ రిజల్ట్ సాధించొచ్చని.. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ విధానాలు, ఆలోచనలు, లా అండ్ ఆర్డర్ సహా పలు అంశాలపై ఎస్పీలతో చర్చించారు చంద్రబాబు. ఈ సమావేశంలో ఆయా జిల్లాల నుంచి ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
అన్ని జిల్లాల ఎస్పీలతో సమావేశం అనంతరం మంత్రులు (AP Ministers), సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారితోనూ పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఈనెల 15, 16 తేదీల్లో జరిగే కలెక్టర్ల సదస్సు అజెండా, నిర్వహణపై చర్చించారు ముఖ్యమంత్రి. అధికారులను పెద్దఎత్తున బదిలీ చేస్తున్నందున పాలనలో మరింత వేగం పెంచే ప్రయత్నాలు చేయాలన్నారు. మంత్రులు మరింత సమర్థమంతంగా, ప్రభావవంతంగా పని చేయాలని ఆదేశించారు. సమస్యలు, సవాళ్లు దాటి సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని.. ఇప్పుడు అదే రీతిలో పాలనలో వేగం పెరగాలంటూ మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు హుకుం జారీ చేశారు. కాగా, ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, అచ్చెంన్నాయుడు, నాదెండ్ల మనోహర్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఇతర మంత్రులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని