Cyclone Montha: ఒక్కో కుటుంబానికి రూ. 3 వేల సాయం: సీఎం చంద్రబాబు కీలక ఆదేశం
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:42 PM
మొంథా తుపాన్ నేపథ్యంలో వివిధ జిల్లాల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, అక్టోబర్ 27: మొంథా తుపాను కారణంగా పునరావాస కేంద్రాలకు తరలించిన ఒక్కో కుటుంబానికి రూ. 3 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని జిల్లా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అలాగే ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని సూచించారు. మొంథా తుపాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే వారి కోసం వైద్య శిబిరాలను సైతం ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే విధంగా జిల్లాల్లో అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
భవిష్యత్‌లో వచ్చే తుపాన్లను ఎదుర్కొనే విధంగా చేపట్టే కార్యాచరణ ఒక రోల్ మోడల్‌గా ఉండాలని అధికారులకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూడాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా బాధ్యత తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాల్లో తుపాన్ రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదేని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వాలంటీర్లుగా వచ్చే వారిని సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచన చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంతకీ కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.. ?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. భారీగా రౌడీషీటర్లు బైండోవర్
For More AP News And Telugu News