Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. భారీగా రౌడీషీటర్లు బైండోవర్
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:01 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ఎన్నికల పోలింగ్ సజావుగా సాగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా..
హైదరాబాద్, అక్టోబర్ 27: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో నగర పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తో సహా మరో 100 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. అయితే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు.
ఇక మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న శ్రీశైలం యాదవ్‌తోపాటు అతడి సోదరుడు రమేశ్ యాదవ్ సహా 19మంది రౌడీ షీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. ఈ ఉప ఎన్నిక కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. అందులో భాగంగా ఉప ఎన్నిక జరుగుతున్న అసెంబ్లీ పరిధిలోని రౌడీ షీటర్లపై పోలీసులు నిఘాను పెంచారు. ఈ ఉప ఎన్నిక వేళ.. వీరిపై కేసులు నమోదైతే పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
బైండోవర్ అంటే.. ?
సాధారణంగా ఎన్నికల సమయంలో బైండోవర్ పదం వినిపిస్తుంటుంది. పాత నేరస్థులు, రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తారు. అంటే.. ఒక వ్యక్తి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా, అతడి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నా.. ఆ వ్యక్తిని తహసీల్దార్ లేదా ఆర్డీవో ఎదుట పోలీసులు హాజరుపరుస్తారు. బాండ్ పేపర్‌పై ఆ వ్యక్తితో చట్ట వ్యతిరేక పనులు చర్యలు చేపట్టబోమని లిఖిత పూర్వకంగా హామీ తీసుకొని సొంతపూచి కత్తుపై విడుదల చేస్తారు.
బైండోవర్‌ను బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్ అంటారు. బైండోవర్ అయిన వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు. అతడిపై ఐపీసీ 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండోవర్ కేసులు నమోదు చేస్తారు. బైండోవర్ సమయంలో వ్యక్తులు రాసిచ్చిన పత్రాలు కొన్ని నెలల వరకు పోలీసుల వద్ద ఉంటాయి.
ఈ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెలువడనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంతకీ కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.. ?
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
For More TG News And Telugu News