Share News

CM Chandrababu: ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఎప్పుడంటే..?

ABN , Publish Date - Dec 09 , 2025 | 08:21 PM

కేబినెట్ మంత్రులు, కార్యదర్శులతోపాటు సచివాలయంలోని వివిధ విభాగాల అధిపతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. వెలగపూడి సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ఈ సమావేశం జరగనుంది.

CM Chandrababu: ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఎప్పుడంటే..?

అమరావతి, డిసెంబర్ 09: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతోపాటు వివిధ విభాగాల హెచ్‌వోడీలతో బుధవారం వెలగపూడి సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకూ వారితో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రానున్న నాలుగు నెలల్లో వృద్ధిరేటు పెంపునకు తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంశాలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన చర్చ జరగనుంది.


అలాగే 2025-26 ఆర్ధిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్ధిక ఫలితాలపై సైతం ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రభుత్వం అందించే పౌరసేవలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపై చర్చించనున్నారు.


ఫైళ్ల క్లియరెన్సు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్లపై ఈ సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు వాటి పరిష్కారంపై హెచ్‌ఓడీలకు సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేయనున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు వాటి ఫలితాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాలు, వాటి రీస్ట్రక్చరింగ్ అంశంపై శాఖల వారీగా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

విజన్‌ డాక్యుమెంట్‌-2047 ఓ దిక్సూచి: డిప్యూటీ సీఎం మల్లు

భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు: హోం మంత్రి

For More AP News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 08:23 PM