Share News

CM Chandrababu: ఆస్తులు, అంతస్తులు, కార్లు ఉన్నా ఆరోగ్యమే కీలకం: సీఎం చంద్రబాబు నాయుడు

ABN , Publish Date - Nov 09 , 2025 | 06:37 PM

ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న శంకర ఆస్పత్రికి అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు.

CM Chandrababu: ఆస్తులు, అంతస్తులు, కార్లు ఉన్నా ఆరోగ్యమే కీలకం: సీఎం చంద్రబాబు నాయుడు
AP CM Chandrababu

గుంటూరు, నవంబర్ 09: భారతదేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందంటే అందుకు కంచి పీఠం లాంటి ఆధ్యాత్మిక సంస్థలే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం గుంటూరు సమీపంలోని శంకర ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. శంకర ఆస్పత్రిలో ఈ విభాగాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శంకర ఆస్పత్రి 50 ఏళ్ల వేడుకకు సైతం తాను ముఖ్య అతిథిగా హాజరవుతానని చెప్పారు. రోజుకు 750 మందికి ఉచితంగా నేత్ర సంబంధ వైద్య సేవలందించడం అరుదైన విషయమని పేర్కొన్నారు.


దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం శంకర ఆస్పత్రి సేవలు అందిస్తోందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఉచితమనే కాకుండా శంకర ఆసుపత్రిలో సమర్థవంతంగా సేవలందిస్తున్నారని వివరించారు. రెయిన్‌బో కార్యక్రమం ద్వారా చిన్నారుల కంటిచూపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారంటూ శంకర ఆసుపత్రి అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఆర్థికపరమైన లక్ష్యాలతో కాకుండా ఆధ్యాత్మిక సేవ లక్ష్యంతో ఈ ఆసుపత్రి నిర్వహిస్తున్నారని తెలిపారు.


పేదరికం లేని సమాజాన్ని నిర్మించటమే తన లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరికీ వర్తించేలా 2,50,000 మందికి హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకురానున్నట్లు వివరించారు. సంజీవని పథకం ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించారు. ఆస్తులు, అంతస్తులు, కార్లు ఉన్నప్పటికీ ఆరోగ్యమే కీలకమని స్పష్టం చేశారు. అనారోగ్యమే అసలైన పేదరికమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.


ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న శంకర ఆస్పత్రికి అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. తాను అధికారంలోకి రాగానే స్విమ్స్ ఆసుపత్రిలో ప్రాణదానం కార్యక్రమం తీసుకువచ్చానని చెప్పారు. గ్రామాలలో 5 వేల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పరాకాష్టకు చేరిన సీఎం రేవంత్ మూర్ఖత్వం: జగదీష్ రెడ్డి

ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు తథ్యం: టీపీసీసీ చీఫ్

For More AP News And Telugu News

Updated Date - Nov 09 , 2025 | 09:44 PM