CM Chandrababu: బీజేపీ గెలుపు కోసం హస్తినలో సీఎం చంద్రబాబు ప్రచారం
ABN , Publish Date - Feb 02 , 2025 | 08:35 PM
CM Chandrababu: బీజేపీ గెలుపు కోసం ఆదివారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను చంద్రబాబు కోరారు. తెలుగు ప్రజలు ఉండే ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ప్రచారం నిర్వహించారు.
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు, తెలుగుదేశం ఎంపీలు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. షాద్రా బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ బహిరంగ సభలో చంద్రబాబు, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఏపీ బీజేపీ నేతలు మాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, రమేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు ఎన్నికల ర్యాలీకి భారీగా ఢిల్లీలోని తెలుగు ప్రజలు తరలివచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని హస్తినలోని తెలుగు ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు కాళ్లు మొక్కి షాద్రా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్ గోయల్ ఆశీర్వాదం తీసుకున్నారు. తెలుగులో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు. తెలుగు ప్రజల హృదయాల్లో చంద్రబాబు నిలిచిపోయారని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
కేజ్రీవాల్‌పై విమర్శలు
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీ నీ గొప్పలు బంద్ జేయ్ అని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్‌ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో చాలామంది తాను వస్తున్నానంటే ఏం చెబుతారో వినడానికి వచ్చారని అన్నారు. ఢిల్లీలో ఉండే తెలుగు వారు అందరూ ఏకపక్షంగా బీజేపీకి ఓటు వేస్తారని చెప్పారు. తెలుగు వారు ఢిల్లీలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో ఇంతమంది తెలుగువారు ఉంటారని అనుకోలేదని చెప్పారు. దావోస్ జూరిక్‌లో 650 మంది తెలుగువారు ఉన్నారన్నారు. మోదీ నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయని చెప్పారు. 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి తాను మాట్లాడానని అన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఏఐ తయారు కావాలని చెప్పారు. ఢిల్లీలో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఇంటింటికీ వెళ్లి బీజేపీ గెలుపు దేశ చరిత్రకు మలుపు అనేలా చెప్పాలని అన్నారు. సరైన నాయకుడు మనదేశానికి సరైన సమయంలో ఉన్నారని.. ఆయనే మోదీ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఢిల్లీలో రాజకీయ పొల్యూషన్..
‘‘ఆర్థిక వ్యవస్థ,టెక్నాలజీలో ముందు ఉన్నాం. భారతదేశం బ్రాండ్ మోగడానికి మోదీ కారణం. 2047 నాటికి భారత్ నెంబర్‌వన్‌గా తయారవుతుంది. ఢిల్లీని చూస్తుంటే చాలా భాధగా ఉంది. 1993లో హైదరాబాద్ ఎలా ఉందో ఢిల్లీ ఇప్పుడు అలానే ఉంది. ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఉంటే ఢిల్లీ వాషింగ్‌టన్ లాగా ఉండేది. ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోయింది. ఆ గాలితో ప్రజలు ఎలా ఉన్నారో తెలియడం లేదు. చాలామంది హైదరాబాద్, బెంగుళూర్ వెళ్లాలని అనుకుంటున్నారు. ఢిల్లీలో రాజకీయ పొల్యూషన్‌తో ఢిల్లీ కలుషితం అయ్యింది. ఢిల్లీలో కమలం పార్టీ గెలిస్తే హస్తిన బాగుపడుతుంది. నరేంద్ర మోదీ మోక్షం ఇస్తే తప్ప ఢిల్లీ బాగుపడదు. ఢిల్లీ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది. అలాంటి ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుంది. పదేళ్లలో ఏం చేశారంటే స్కూళ్లు పెట్టమని అంటున్నారు. ఢిల్లీ మురికి కుపం లాగా మారింది. ఢిల్లీలో స్వచ్ఛమైన మంచినీరు తాగే పరిస్థితి లేదు. బీహార్ నుంచి ఉపాధికి ఢిల్లీ వచ్చే వారు...ఇప్పుడు అందరూ సౌత్ ఇండియాకు వస్తున్నారు. ఢిల్లీలో అభివృద్ధి ఆగిపోయింది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో బెస్ట్‌గా ఉంది. ప్రతి మహిళకు రూ. 2500 , గ్యాస్ సిలిండర్ హోలీ పండుగకు ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. అనేక పథకాలు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.