CM Chandrababu slams YSRCP: రాజకీయ ముసుగులో నేరాల చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం: సీఎం
ABN , Publish Date - Dec 08 , 2025 | 08:42 PM
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోనే చోరీ జరిగితే అది చిన్నదని ఎలా సమర్థిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గతంలో నాసిరకం ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చినా దానిని కూడా సమర్ధిస్తారా..? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి,డిసెంబర్ 08: రాజకీయ ముసుగులో నేరాలు చేసిన వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పరకామణిలో డబ్బులు కొట్టేసిన వ్యవహారాన్ని చిన్న నేరం అని చెప్పడాన్ని ఏమనాలని ఆయన ప్రశ్నించారు. అంటే వాళ్ల మైండ్ సెట్ ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. రూ. 72 వేల కోట్లు కొట్టేసి రూ. 14 కోట్లు దేవుడికి ఇచ్చారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.
శ్రీవెంకటేశ్వర స్వామి వారికి 121 కేజీల బంగారాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లు ఒక భక్తుడు తన వద్దకు వచ్చి చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. దేవాలయంలో చోరీ చేస్తే.. తక్షణమే ఈవోపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. దేవాలయంలో దేవుడి దగ్గర సొమ్మును చోరీ చేస్తే దానిని సమర్ధిస్తారా..? అని వైసీపీ నేతల వ్యవహారాన్ని ఈ సందర్బంగా ఆయన ఎండగట్టారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోనే చోరీ జరిగితే అది చిన్నదని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. గతంలో నాసిరకం ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చినా దానిని కూడా సమర్ధిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి స్వామివారి ప్రసాదం తయారీకి సరఫరా చేసిన ఘటనను వెనకేసుకు వస్తారా..? అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఇలాంటి వాటిని సమర్థిస్తున్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నారని తెలిపారు.
ఇలాంటి వారితో రాజకీయం చేయడం తనకు సిగ్గు అనిపిస్తోందన్నారు. సింగయ్య అనే వ్యక్తిని కారు కింద తొక్కిం చేసి ఆయన భార్యతోనే తమపై ఆరోపణలు చేయిస్తూ మీడియా సమావేశం పెట్టించారని సీఎం చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ నుంచి మద్యం సేవిస్తూ వచ్చి ప్రమాదంలో పాస్టర్ మరణిస్తే.. ఆ ఘటనను కూడా హత్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇలా ప్రతీ అంశంలోనూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ అగ్రనేతల వైఖరిపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు.
నెల్లూరు ఒకప్పుడు ప్రశాంతమైన నగరమని.. కానీ ప్రస్తుతం ఆ నగరంలో లేడీ డాన్‌లు తయారయ్యారని విమర్శించారు. వారు హత్యలు చేస్తున్నారు.. గంజాయి డాన్‌లుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి సమస్య ఉండేది కాదని.. రాయలసీమలో ప్యాక్షన్ , తెలంగాణలో నక్సలిజం ఉండేదని వివరించారు. అలాగే కోస్తా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు సైతం ప్రశాంతంగా ఉండేవన్నారు. నెల్లూరులో సీపీఐ నేత పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకునే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కొట్టిపారేశారు. కావాలంటే జీఎస్‌డీపీ లెక్కలు ఒక సారి పరిశీలించాలంటూ వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు సూచించారు. కొత్త జిల్లాల్లో కూడా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం వెళ్లుతూ వెళ్లుతూ రూ. 10 లక్షలు కోట్లు అప్పులు పెట్టి వెళ్లిపోయిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Read Latest AP News And Telugu News