CM Chandrababu: రెవెన్యూ సేవలు మరింత సులభతరం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:06 PM
జాయింట్ కలెక్టర్లు లేని జిల్లాలకు వెంటనే వారిని నియమించాలని సీఎం ఆదేశించారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. 26 జిల్లాల్లోనూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసమే జేసీలు పని చేయాలని సీఎం క్లారిటీ ఇచ్చారని చెప్పారు.
అమరావతి, డిసెంబర్ 09: రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రియల్‌టైమ్‌లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఆటో మ్యుటేషన్ జరగాలని ఆయన పేర్కొన్నారు. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి కావాలని ఆయన ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తోపాటు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం భూ యజమానులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని ఈ సందర్భంగా వారికి సూచించారు. రెవెన్యూ శాఖలో ఏడాదిలోగా పూర్తి ప్రక్షాళన జరగాలని వారికి తెలిపారు. ప్రతి నెలా రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహిస్తానని వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
ఏపీని భూ వివాద రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే లక్ష్యం: మంత్రి అనగాని
రాష్ట్రంలో జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వెబ్ ల్యాండ్‌లో ఏ మార్పు జరిగినా అది ఆన్‌లైన్‌లో శాశ్వతంగా నిక్షిప్తం అయ్యేలా వ్యవస్థను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మంత్రి అనగాని సత్య ప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ.. గత పాలకులు చేసిన పాపాల వల్లే రెవెన్యూ సమస్యలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు.
ఏడాదిన్నరగా వైసీపీ ప్రభుత్వ పాపాలు కడిగేందుకు కృషి చేస్తున్నందు వల్లే ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దోచుకునేందుకు గత పాలకులు అస్తవ్యస్తం చేసిన విధానాలు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్నాయని పేర్కొన్నారు. 7,600 గ్రామాల్లో పకడ్బందీగా రీ సర్వే పూర్తి చేశామని వివరించారు.
అవినీతి,అక్రమాలకు తావులేకుండా పాస్‌పోర్ట్ కార్యాలయాల తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. జాయింట్ కలెక్టర్లు లేని జిల్లాలకు వెంటనే వారిని నియమించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 26 జిల్లాల్లోనూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసమే జేసీలు పని చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారన్నారు. భూ సమస్యలన్నింటికీ ఇకపై జాయింట్ కలెక్టర్లదే బాధ్యత అని మంత్రి అనగాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
22ఏ, ఫ్రీ హోల్డ్ సమస్యలు పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. భూ వివాద రహిత ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దేందుకు ప్రతీ బుధవారం కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఎల్లుండి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. ఇప్పటి వరకు 86 శాతం సమస్యలు పరిష్కరించామన్నారు. 14 శాతం పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం న్యాయపరంగా, విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చాలన్నదే తమ లక్ష్యమని మంత్రి అనగాని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా
Read Latest AP News And Telugu News