Amaravati Farmers Slam YSRCP: అమరావతిపై వైసీపీకి ద్వేషం తగ్గలేదు: రాజధాని రైతులు
ABN , Publish Date - Sep 13 , 2025 | 09:31 PM
అమరావతిపై వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు స్పందించారు. అమరావతిపై ఆ పార్టీ నేతల్లో ఇంకా ద్వేషం పోలేదన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 13: వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. పార్టీ అధినేత వైఎస్ జగన్ విశాఖపట్నం వెళ్లరని.. రాజధాని అమరావతి నుంచే పాలన చేస్తారంటూ ఆ పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాజధానికి భూములు ఇచ్చిన రైతులు శనివారం అమరావతిలో స్పందించారు. అమరావతిపై వైసీపీ నేతలు ఇంకా విషం కక్కుతున్నారంటూ వారు మండిపడ్డారు. మరో సారి వైసీపీ మాటలు నమ్మి మోసపోమంటూ రాజధాని రైతులు కుండబద్దలు కొట్టారు.
సీఆర్డీఏ చట్ట పరిధిలో అభివృద్ధి కాదని ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు కడతామనటం మరో చిచ్చు పెట్టే ప్రయత్నమేనని వారు అభిప్రాయపడ్డారు. పరిపాలనకు ప్రస్తుతం ఉన్న సచివాలయం సరిపోతుందని.. కొత్త భవనాలు అనవసరం అంటూ చేసిన వ్యాఖ్యలతో ఇంకా అమరావతిపై ఆ పార్టీ నేతల్లో ద్వేషం తగ్గలేదన్న విషయం స్పష్టమైందని రాజధాని రైతులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న సచివాలయం, హైకోర్టు భవనాలనే నిన్నటి వరకూ గ్రాఫిక్స్ అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేశారని రైతులు పేర్కొన్నారు. అలాంటిది ఆయా భవనాలు సరిపోతాయంటూ ప్రస్తుతం వారు పేర్కొనడం ఎంత వరకు సబబూ అని అమరావతి రైతులు ప్రశ్నించారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం అమరావతిని అభివృద్ధి చేస్తూ.. రైతులకు న్యాయం చేస్తానన్న మాటకు కట్టుబడి సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారని తెలిపారు.
11 సీట్లకు పరిమితమైన వైసీపీ పార్టీకి చెందిన నేతలు.. ఏడాదిన్నర తర్వాత బయటకు వచ్చి అమరావతి నుంచే పాలన ఉంటుంది.. కొత్త భవనాలు అవసరం లేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దేనికి సంకేతమంటూ వారు సందేహం వ్యక్తం చేశారు. భూ త్యాగాలు చేసిన రైతుల్ని మరోసారి నట్టేట ముంచుతామని చెప్పిస్తున్న జగన్ రెడ్డి వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రైతులు కుండబద్దలు కొట్టారు. కల్లబొల్లి మాటలతో మళ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలనుకుంటున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో వచ్చేది కేవలం సింగిల్ డిజిట్టే మాత్రమేనంటూ రాజధాని రైతులు ఈ సందర్భంగా జోస్యం చెప్పారు.
అసలు పాయింట్ ఇది..
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేని రాష్ట్రంగా మారింది. అదే సమయంలో ఎన్నికలు సైతం జరగడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు అయింది. అనంతరం రాజధానిని ఏపీలోని అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉండే విధంగా గుంటూరు జిల్లాలోని తూళ్లూరు ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దాదాపు 29 గ్రామాల ప్రజలు, రైతులు.. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు వేలాది ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారు.
దీంతో ప్రధాని మోదీ చేతుల మీదగా.. రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టారు. ఈ రాజధాని నిర్మాణానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం అసెంబ్లీ వేదికగా మద్దతు తెలిపారు. ఇంతలో 2019 ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటరు వైసీపీకి పట్టం కట్టాడు. దాంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అనంతరం ఏపీకి మూడు రాజధానులంటూ వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. దీంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఆందోళన చెందారు. అందులో భాగంగా వారంతా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతోపాటు మహా పాదయాత్ర సైతం చేపట్టారు.
కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. అంతేకాకుండా రాజధాని రైతులు చేపట్టిన అన్ని దీక్షలను జగన్ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచివేసింది. ఇంతలో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. దీంతో ఈ కూటమికి ఏపీ ఓటరు పట్టం కట్టాడు. దాంతో కూటమికి 164 సీట్లు వచ్చాయి.
వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్ష హోదా సైతం ఆ పార్టీకి దక్కలేదు. దీంతో తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆ హోదా కోసం ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొట్టేశారు. అలాంటి వేళ.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాజధాని అమరావతి నుంచే వైఎస్ జగన్ పాలన చేస్తారంటూ ఆ పార్టీ సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేయడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మంచినీళ్ల కోసం వెళ్లిన మహిళలు.. అది చూసి పరుగో పరుగు..
ఇంట్లోంచి పెద్దగా అరుపులు.. లోపలికెళ్లి చూడగా షాక్..
For More AP News And Telugu News