AP News: ఆయ్.. హ్య‘ఫ్రీ’ అండి.. కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్‌లు
ABN , Publish Date - Dec 27 , 2025 | 10:41 AM
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం పట్ల మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభించి నాలుగు నెలల్లో మొత్తం రూ. 4 కోట్ల వరకు మహిళలకు డబ్బు ఆదా అయినట్టు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి.
- 4 నెలలు.. రూ.100 కోట్లు
- మహిళలకు ఉచిత బొనాంజా
- బస్సుల్లో పెరుగుతున్న ఆక్యుపెన్సీ
- బస్సులు సరిపడక అగచాట్లు
- అపరిమితంగా ప్రయాణికులు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ఉచిత బస్ పథకం పథకాన్ని మహిళలు అంతలా ఉపయోగిస్తున్నారు. అందుకే ఎక్కడా బస్‌లు ఖాళీ ఉండ డంలేదు. మగవాళ్లు టిక్కెట్ తీసుకుని ఖాళీ లేక ఇక్కట్లు పడుతుంటే.. మహిళలు మాత్రం ఉచిత బస్ ప్రయాణం సాఫీగా చేసేస్తున్నారు.ఈ ఏడాది మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన బంపర్ బొనాంజా ‘స్త్రీ శక్తి’ అని రుజువవుతోంది. ఏ బస్సు చూసి నా మహిళలు ఫుల్‌గా ఉంటున్నారు. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభించగా ఇప్పటి వరకూ ఉమ్మడి తూర్పుగోదా వరిలో రూ.100 కోట్లకు పైగానే మహిళలకు ఆదా అయ్యింది. ఈ డబ్బు లు మహిళల తరపున ఆర్టీసీకి ప్రభుత్వం జమ చేస్తుంది. చేతిలో పైసా లేకపోయినా బస్సెక్కి రయ్‌మని వెళ్లొచ్చేస్తున్నారు ఎంచక్కా!.
ఈ రూట్లు బిజీ..
పథకం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 4.50 కోట్ల మంది ప్రయాణించగా అం దులో 3 కోట్లు స్త్రీ శక్తి వాటాగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు రూట్లు నడిచే బస్సులు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఓ రకంగా ఇతర ప్రయాణికులు ఎక్కే అవకాశమే ఉండడం లేదు. తూర్పు గోదావరిలో రాజమహేంద్రవరం నుంచి తుని, కాకినాడ వయా బిక్కవోలు,రాజానగరం, ఏలూ రు, రామచంద్రాపురం, సీతానగరం, కాకినాడ జిల్లాలో తుని, రావులపాలెం, రాజమహేంద్ర వరం, కోనసీమలో అమలాపురం నుంచి రాజమహేంద్రవరం, రాజోలు, రామచంద్రాపు రం, రాజోలు నుంచి రాజమహేంద్రవరం రూట్లు రద్దీగా ఉండడంతో ఎక్కువ బస్సులు నడపాల్సి వస్తోంది.

‘ఫ్రీ’ బాలారిష్టాలు..
ఆర్టీసీలో సిబ్బంది కొరత వల్ల తీవ్ర ఇబ్బంది అవుతోంది. కండక్టర్లు అనారోగ్యాలకు గురవు తున్నారు. పెద్ద వయసు కండక్టర్లు డ్యూటీ చేయడానికి భయపడిపోతున్నారు. ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్న బస్సుల ఆక్యుపెన్సీ పెరిగినట్టు కనిపిస్తున్నా.. మిగతా బస్సుల్లో ఎక్కువ తరుగుదల నమోదవుతోంది. పథకం వచ్చిన తర్వాత మహిళల ప్రయాణాల సంఖ్య దాదాపు 500 శాతం పెరిగిపోయింది. ఫ్రీబస్సుల్లో పురుషులు, వృద్ధులు, పిల్లలు కాలుపెట్టే వీల్లేకుండా పోయింది. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం నిషేధమైనా ప్రస్తుతం ఆ నిబంధన ఎక్కడా పని చేయడం లేదు. మైలేజీ తగ్గింది. లీటరు డీజిలు 5.50 కిలోమీటర్ల నుంచి 5కి పడిపోయింది. తద్వారా నిర్వ హణ వ్యయం పెరిగిపోయింది.
టైర్ల అరుగుదల వేగమైంది. ప్రస్తుతానికి అందు బాటులో ఉన్న బస్సులు, సిబ్బందితోనే ఆర్టీసీ నెట్టుకొస్తోంది. కొత్త బస్సుల అవసరత అత్యవసరంగా కనిపిస్తోంది. తూర్పుగోదావరి, కాకినాడకు చేరో 50 కొత్త ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని చెబుతున్నారు. అవి ఎప్పటికి వస్తాయో స్పష్టత లేదు.అవి వస్తే మరికొన్ని డీజిల్ బస్సులు ఉచిత ప్రయాణాలకు తిప్పే వెసులుబాటు కలుగుతుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసేసిన అద్దె బస్సులనే వెనక్కి పిలుచుకున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 285 బస్సులకు 241, కాకినాడ 293కి 167, డా. బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమలో 317కి 192 బస్సులు ఉచిత ప్రయాణాలకు తిరుగు తున్నాయి. మొత్తం ప్రయాణించే వాళ్లలో ఉచిత ప్రయాణాలు 50 శాతం ఉంటాయని ముందు అంచనా వేయగా అది క్రమంగా సరాసరిన 66 శాతానికి చేరింది.
వందనాలమ్మా!..
ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం తూర్పు గోదావరి ఈ నెల 22 వరకూ కాగా కోనసీమ, కాకినాడ ఈ నెల 1వ తేదీ వరకూ లెక్కలు చూస్తే మహిళలకు రూ.95.48 కోట్లు ఆదా అయ్యింది.అదే కోనసీమ, కాకినాడ కూడా 22 వరకూ తీసుకుంటే దాదాపు రూ.100 కోట్లపైమాటే గృహిణులకు ఉచిత బస్సు టికెట్ పేరుతో ప్రభుత్వం చెల్లించింది.
మొత్తం
జిల్లా ప్రయాణాలు మహిళలు ఆదాయం మహిళలు శాతం
తూర్పు 1.61కోట్లు 1.08 కోట్లు 67.57 34.84 67
కోనసీమ 1.60 1.06 79.78 31.60 67
కాకినాడ 1.29 0.82 74.08 29.04 64
మొత్తం 4.50 2.96 221.43 95.48 66
అమ్మా నిన్ను చూడాలని ఉందే.. ఈ రోజు ఉదయమే కదా రాజమహేంద్రవరం వెళ్లావ్.. ఏమోనో.. మళ్లీ చూడాలనిపిస్తుంది.. అయితే వచ్చేయ్.. ఆర్టీసీ బస్ ఫ్రీ కదా.. ఆధార్ కార్డు పట్టుకుని కాకినాడ బస్సెక్కెయ్.. మీ ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైమ్‌కి సాయంత్రం మళ్లీ వెళ్లిపోదువుగాని..
వీధంతా కలిసి జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి వెళదాం.. వచ్చే వారంతా ఆధార్‌కార్డులు పట్టుకుని ఉదయమే బస్టాండ్‌కి వచ్చేయండి.. అక్కడ నుంచి కలిసి వెళ్లిపోదాం.. బస్ ఫ్రీ కదా.. ఖర్చేం కాదులే.. సరదాగా ఉంటుంది.. ఇదీ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఒక వీధికి చెందిన పెద్దావిడ ఆర్డర్..
రాజమహేంద్రవరానికి చెందిన ఒకావిడ అమ్మగారి ఊరు తుని.. భర్త ఆఫీస్‌కి వెళుతూ ఆవిడను బస్టాండ్ వద్ద దించేస్తాడు.. ఆవిడ బస్సెక్కి తుని వెళ్లి సాయంత్రం భర్త వచ్చే టైమ్‌కి మళ్లీ ఇంటికి వచ్చేస్తోంది..మళ్లీ ఉదయం మామూలే.. ఇదీ రోజువారి ఆమె దినచర్య.. ఇలా మహిళలు స్త్రీశక్తి చూపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News