Andhra Pradesh: బిగుస్తున్న ఉచ్చు
ABN , Publish Date - Jan 18 , 2025 | 03:26 AM
వైసీపీ హయాంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న సీఐడీ మాజీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్‌కు ఉచ్చు బిగుస్తోంది.

ఐపీఎస్ సునీల్‌పై విచారణకు ఆదేశం
అగ్రిగోల్డ్ నకిలీ డిపాజిటర్ల పేరుతో రూ.7.20 లక్షలు స్వాహా
సాంకేతికత అభివృద్ధి మాటున రూ.75 లక్షలు నొక్కేశారు
బిల్లు అడిగిన కాంట్రాక్టర్‌పై కేసు పెడతామని బెదిరించారు
అక్రమ సంపాదనతో వ్యాపారాలు, తరచూ దుబాయ్‌కి
సీఐడీ మాజీ ఏడీజీ అక్రమాలపై ఏసీబీకి రఘురామ ఫిర్యాదు
ఆరోపణలన్నింటిపై విచారణ
విచారణ అధికారులుగా సిసోడియా, హరీశ్ గుప్తా
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న సీఐడీ మాజీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్‌కు ఉచ్చు బిగుస్తోంది. నకిలీ డిపాజిటర్లను సృష్టించి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన సొమ్ము రూ.లక్షలు స్వాహా చేశారని, సీఐడీలో సాంకేతికత అభివృద్ధి పేరుతో రూ.75లక్షలు నొక్కేశారని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. సునీల్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలు అందజేశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో సునీల్ చేసిన అరాచకాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అమాయకులపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు సోషల్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ మూకలను వదిలేసిన సునీల్‌పై పలు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం... విచారణ అధికారులుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై వచ్చిన ఆరోపణలకు సునీల్ కుమార్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని, ఆయనపై అభియోగాలను విచారించి సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో సునీల్ అరెస్టు తప్పదని పోలీసు ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.
అడ్డగోలుగా అరాచకాలు
వైసీపీ హయాంలో సీఐడీ ఏడీజీగా సునీల్ కుమార్ నియమితులయ్యారు. అప్పటి సీఎం జగన్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై ఏకంగా దేశద్రోహం కేసు నమోదు చేసి కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసేవారు. ప్రతిపక్షాలకు చెందినవారు నోరెత్తితే తీవ్రంగా పరిగణించి అర్ధరాత్రి వారి ఇంట్లోకి చొరబడి స్టేషన్‌కు ఎత్తుకొచ్చేవారు. సీఐడీ కస్టడీలో నాటి వైసీపీ ఎంపీ రఘురామరాజును టార్చర్ చేసినవారిలో కామేపల్లి తులసిబాబు కూడా ఉన్నారన్న ఆరోపణలపై ఇటీవల పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా తులసిబాబు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలిసింది. అందులో సునీల్ అక్రమాల గురించిన వివరాలు కూడా ఉండటంతో వాటిని నిర్ధారించుకున్న పోలీసులు ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీంతో ఇప్పటికే సీఐడీ మాజీ ఏడీజీపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం... రఘురామ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని సునీల్‌పై చర్యలకు సిద్ధమవుతోంది.
బిల్లు కావాలా... కేసు కావాలా?
సునీల్ కుమార్ సీఐడీ ఏడీజీగా ఉన్న సమయంలో ఆ విభాగంలో సాంకేతికత పరిజ్ఞానం అభివృద్ధి కోసం గుజరాత్‌కు చెందిన కంపెనీతో రూ.కోటిన్నరకు ఒప్పందం కుదిరింది. ఆ కంపెనీ ఏపీకి చెందిన వ్యక్తికి సబ్ కాంట్రాక్టు ఇచ్చింది. పని పూర్తిచేసిన తర్వాత బిల్లు కోసం సదరు కాంట్రాక్టర్ సునీల్ కుమార్‌ను కలిశారు. వెంటనే ఆయన ఫోన్ తీసుకుని ‘నీకు బిల్లు కావాలా.? డ్రగ్స్ సరఫరా చేస్తున్నావనే కేసు కావాలా?’ అంటూ బెదిరించారు. బిత్తరపోయిన సబ్ కాంట్రాక్టర్ తనను వదిలేస్తే చాలని వేడుకున్నారు. అయితే ఎప్పటికైనా రికార్డులో ఉండాలని వేరే మార్గంలో ఆయన వద్ద రూ.75లక్షలు తీసుకుని అధికారికంగా అతని ఖాతాలో జమ చేశారు. దీనిపై సమాచారం సేకరించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆ మొత్తం ఎవరెవరి ఖాతాలకు చేరాయో ఆధారాలతో సహా ఏసీబీకి అందజేశారు. ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ తరచూ దుబాయ్‌కి వెళ్లిన సునీల్ కుమార్ బినామీలతో కలసి కుమారుల పేరిట అక్కడ వ్యాపారాలు చేస్తున్నట్లు ఏసీబీకి రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు. ఆయన బ్యాంకు లావాదేవీలు, ప్రయాణ వివరాలను సమర్పించారు. ‘సునీల్ కుమారులకు వ్యాపారాలు చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ వ్యాపార వివరాలు ప్రభుత్వానికి తెలియజేశారా?’ అనే అనుమానాలు లేవనెత్తారు. హైదరాబాద్ శివారులో అగ్రిగోల్డ్ భూమిని వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తుల్ని సైతం తులసిబాబు గ్యాంగ్‌తో సునీల్ బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. బాపట్ల జిల్లా రామకూరులో 96మంది నకిలీ డిపాజిటర్ల ఖాతాల్లో అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన సొమ్ము రూ.7.20లక్షలు డిపాజిట్ చేయించారని, ఆ తర్వాత వారిని బెదిరించి విత్‌డ్రా చేసుకున్నట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా ఖాతాల వివరాలతో పాటు ఫోన్ నంబర్లు సైతం అందజేశారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ అక్రమాలపై ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆయన అరెస్టు తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.