Pawan Kalyan: జనసేన పవర్ ముందు జగన్ డీలా.. నాడు అలా.. నేడు ఇలా
ABN , Publish Date - Mar 14 , 2025 | 09:22 AM
పన్నేండేళ్ల జనసేన ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ తన పవరేంటో చూపించారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ పనైపోయిందనుకున్నవాళ్లంతా.. 2024 ఫలితాల తర్వాత పవన్‌దే భవిష్యత్తు అనడం వెనుక కారణం ఏమిటి. తనను తీవ్రంగా విమర్శించిన రాజకీయ ప్రత్యర్థులకు పవన్ తన దెబ్బను రుచి చూపించారా.

రాజకీయాలకు పనికిరారంటూ అవహేళన చేశారు. అసెంబ్లీ గేటు తాకనివ్వబోమని శపథం చేశారు. అయినాసరే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్లారు. కొద్దిరోజులకు శపథం చేసిన వాళ్ల నోళ్లు మూతబడ్డాయి. పవన్‌తో పెట్టుకుంటే మసైపోతామనేలా తన తడఖా చూపించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎంతోమంది రాజకీయ పార్టీలు పెట్టారు. కొద్దిమంది మాత్రమే సక్సెస్ రుచి చూశారు. ఆ కొద్దిమందిలో ఒకరు పవన్ కళ్యాణ్. ఆయన పార్టీ పెట్టగానే వాళ్ల అన్ననే ఏమి చేయలేకపోయారు. ఇక ఈయన ఏంచేస్తారులే అనుకున్నారంతా. కానీ 12 ఏళ్ల కాలంలో తానెంటో నిరూపించుకున్నారు. అందరూ వేరు తాను వేరంటూ నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టినప్పటినుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అవమానాలు భరించారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదిగితే తమ ఉనికి కష్టమవుతుందనే ముందస్తు ఆలోచనతోనే వైసీపీ మొదటినుంచి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ప్యాకేజ్ స్టార్ అంటూ అవమానించింది. అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు లక్ష్యంగా చేసుకున్నా.. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందంటూ ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. పార్టీ స్థాపించిన 11 ఏళ్లకే పవన్ కళ్యాణ్ తానమేంటో నిరూపించుకున్నారు. జనసేనను అసెంబ్లీలో ఎలా అడుగుపెడుతుందో చూస్తామన్న నాయకులు నోరు మెదపలేని స్థితిని పవన్ కళ్యాణ్ కల్పించారు. 2019 ఎన్నికల్లో జనసేన పవరేంటో పవన్ కళ్యాణ్ చూపించారు. దీంతో పవన్‌తో పెట్టుకుంటే ఎంతో ప్రమాదమో జగన్‌కు తెలిసొచ్చినట్లైంది.
దటీజ్ పవన్..
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన బీఎస్పీ, వామపక్షాలతో కలిసి పోటీచేసింది. కేవలం ఒక నియోజకవర్గంలో మాత్రమే జనసేన అభ్యర్థి విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. రాజోలు నుంచి ఆ పార్టీ తరపున రాపాక వరప్రసాద్ విజయం సాధించగా.. ఆ తర్వాత కాలంలో ఆయన వైసీపీలో చేరారు. దీంతో జనసేన తరపున ఒక ఎమ్మెల్యే గెలిచినప్పటికీ.. ఆ పార్టీ గొంతు శాసనసభలో వినిపించేందుకు ఒక్కరూ లేని పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ పనైపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. వైసీపీ సైతం 2019 నుంచి పవన్‌ను మరింత గట్టిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. పవన్ మాత్రం ఎక్కడా కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగారు. వైసీపీ అరాచకాలను గమనించిన పవన్ కళ్యాణ్.. మరోసారి జగన్ సీఎం అయితే ఎంత ప్రమాదమో గమనించి.. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోననే నినాదాన్ని ఇచ్చి.. దానికనుగుణంగా తన పొలిటికల్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. ఏది ఏమైనా 2024లో వైసీపీ అధికారంలోకి రాదని పవన్ చెప్పారు. అలా చెప్పి ఊరుకోలేదు.. తన మాట నెగ్గించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ముందుకు సాగుతూ ఎట్టకేలకు విజయం సాధించారు.
నాడు అలా.. నేడు ఇలా..
2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేసింది. మొత్తం 21 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ పోటీచేయగా.. అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నీతి, నిజాయితీతో కూడిన పాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారో చూస్తామన్న నాయకులు.. ప్రస్తుతం ఆయనను ఉప ముఖ్యమంత్రి హోదాలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పవన్ కళ్యాణ్ జగన్‌కు తన దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారనే చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..
Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?
Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here