Godavari Floods Damage: వరద ఎఫెక్ట్.. నీటమునిగిన కాజ్‌వేలు, రోడ్లు
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:26 PM
మిర్చి పంట వరద నీటిలో మురిగిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ కాజ్ వేలు, రహదారులు నీటమునిగాయి.
రాజమండ్రి, సెప్టెంబర్ 30: అల్లూరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై గోదావరి వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరద ప్రభావంతో అల్లూరి జిల్లాలో కాజ్ వేలు, రహదారులు నీటమునిగాయి. దాదాపు 40 గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు నాటుపడవలు పైనే ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి. మిర్చి పంట వరద నీటిలో మునిగిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ కాజ్ వేలు, రహదారులు నీటమునిగాయి. నాటుపడవలుపైనే లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.
అయితే రాత్రిపూట రాకపోకలకు అవకాశం లేకపోవటంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు మోహం చాటేస్తున్న పరిస్థితి. దీంతో తాగునీటి కోసం, నిత్యావసర వస్తువుల కోసం వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశుగ్రాసం కొరతతో పశువుల కూడా విలవిలలాడుతున్నాయి.
అప్రమత్తంగా ఉండండి..
కాగా.. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 48.7 అడుగులకు చేరగా.. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10,27,276 క్యూసెక్కులు ఉంది. ఈ క్రమంలో బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి మరింత వరద పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,41,247 క్యూసెక్కులుగా ఉంది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహం నేపథ్యంలో కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని... అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
విద్యుత్ ఛార్జీలపై గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి
ప్రజలతో మమేకం అవ్వండి.. నేతలకు సీఎం దిశానిర్దేశం
Read Latest AP News And Telugu News